IPL Betting Case : హైదరాబాద్ ఐపీఎల్ బెట్టింగ్ కేసును మూసేసిన సీబీఐ.. ఏమిటిది ?

IPL Betting Case : 2019లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌ల ఫిక్సింగ్‌కు సంబంధించిన రెండు కేసులను సాక్ష్యాలు లేని కారణంగా సీబీఐ మంగళవారం మూసేసింది.

  • Written By:
  • Publish Date - January 2, 2024 / 05:47 PM IST

IPL Betting Case : 2019లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌ల ఫిక్సింగ్‌కు సంబంధించిన రెండు కేసులను సాక్ష్యాలు లేని కారణంగా సీబీఐ మంగళవారం మూసేసింది. క్రికెట్ బెట్టింగ్‌ ముఠాలోని వ్యక్తుల నెట్‌వర్క్ అనేది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌ల ఫలితాలను ప్రభావితం చేస్తోందని పాకిస్తాన్ నుంచి అందిన రహస్య సమాచారం ఆధారంగా అప్పట్లో ఈ కేసులను సీబీఐ నమోదు చేసింది. బెట్టింగ్ దందా కోసం నిందితుల బ్యాంకు అకౌంట్ల నుంచి అనుమానాస్పద నగదు లావాదేవీలు జరిగాయని, దాదాపు 13 ఏళ్లుగా వాళ్లు ఈ తతంగాన్ని నడుపుతున్నారనే అభియోగాలను సీబీఐ మోపింది. అనంతరం 2022 మేలో ఏడుగురిపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు కూడా దాఖలు చేసింది. మొదటి ఎఫ్‌ఐఆర్‌లో ఢిల్లీలోని రోహిణి ప్రాంతానికి చెందిన దిలీప్ కుమార్, హైదరాబాద్‌‌కు చెందిన గుర్రం వాసు, గుర్రం సతీష్‌లను నిందితులుగా ప్రస్తావించింది. రెండో ఎఫ్ఐఆర్‌లో రాజస్థాన్‌కు చెందిన సజ్జన్ సింగ్, ప్రభు లాల్ మీనా, రామ్ అవతార్, అమిత్ కుమార్ శర్మలను నిందితులుగా(IPL Betting Case) పేర్కొంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు పాకిస్థానీ మొబైల్ నంబర్ ద్వారా పాకిస్థాన్ వ్యక్తులతో టచ్‌లో ఉన్నారని సీబీఐ ఆరోపించింది. గుర్రం సతీష్ నిర్వహిస్తున్న 6 బ్యాంకు ఖాతాల్లోకి 2012-20 మధ్యకాలంలో రూ. 4.55 కోట్లు మన దేశంలో నుంచి, రూ. 3.05 లక్షలు విదేశీ గడ్డపై నుంచి డిపాజిట్ అయ్యాయని ఆరోపించింది.  ఇదే సమయంలో గుర్రం వాసు నిర్వహించిన బ్యాంకు అకౌంట్లలోకి  రూ. 5.37 కోట్లు డిపాజిట్ అయ్యాయని తెలిపింది. ఢిల్లీ, హైదరాబాద్ కేంద్రాలుగా ఐపీఎల్ బెట్టింగ్ రాకెట్‌ నడిచిందని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లలో పేర్కొంది.

Also Read: Plane In Flames : మంటల్లో విమానం.. 367 మంది బిక్కుబిక్కు.. ఐదుగురి మృతి ?

ఈ వ్యవహారంపై దాదాపు రెండేళ్లపాటు విచారణ జరిపిన సీబీఐ.. ఆ నిందితులపై ప్రాసిక్యూషన్‌ను కొనసాగించేందుకు తగిన ఆధారాలను కూడగట్టలేకపోయింది. దీంతో ఈ కేసును మూసేస్తామంటూ డిసెంబర్ 23న ప్రత్యేక కోర్టులో సీబీఐ అభ్యర్ధనను దాఖలు చేసింది. కేసును మూసివేసేందుకు దారితీసిన కారణాలను అందులో వివరించింది. ఈ నివేదిక ఆధారంగా ఐపీఎల్ బెట్టింగ్ కేసును మూసేయాలా ? వద్దా ? అనే దానిపై సీబీఐ ప్రత్యేక కోర్టు తదుపరి నిర్ణయాన్ని తీసుకోనుంది.