Site icon HashtagU Telugu

Munugode Politics: మును‘గౌడ్’.. కాకరేపుతున్న క్యాస్ట్ పాలి‘ట్రిక్స్’

Munugodu

Munugodu

మునుగోడులో క్యాస్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. కుల రాజకీయాలు చేస్తుండటంతో ఆ నేతలు ఇటు, ఈ నేతలు అంటు జంపింగ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక ముందు బీజేపీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ కమలానికి గుడ్ బై చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ లో ఆయన టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లారు. సరిగ్గా మునుగోడు ఉప ఎన్నిక వేళ ఆయన పార్టీనుంచి బయటకొచ్చారు. వస్తూ వస్తూ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణపై బీజేపీ వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు. బీజేపీలో బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోందని, తనకు అడుగడుగునా పార్టీలో అవమానాలే ఎదురయ్యాయని చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఆర్థిక లాభం కోసమే ఉప ఎన్నిక వచ్చిందని ఆరోపించారు భిక్షమయ్య గౌడ్. బీజేపీనుంచి బయటకు వస్తూ ప్రజలకు సుదీర్ఘ లేఖ రాశారు భిక్షమయ్య గౌడ్. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రుల దాకా ప్రతి ఒక్కరూ డబుల్ ఇంజన్ సర్కార్ పేరిట మాటలు చెప్పడమే కానీ ఇప్పటిదాకా ఒక్క పైసా అదనపు సహాయాన్ని తెలంగాణకు ఇవ్వలేదని మండిపడ్డారు భిక్షమయ్య గౌడ్.

రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం లేకపోతే నిధులు ఇవ్వము, అభివృద్ధిని పట్టించుకోము అని చెప్పడం డబుల్ ఇంజన్ సర్కారు మోడల్ లోని డొల్లతనానికి అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు. తెలంగాణ బీజేపీ నాయకత్వంపై కేంద్రానికి ఏమాత్రం పట్టులేదని చెప్పారు భిక్షమయ్య గౌడ్. తెలంగాణలో ప్రశాంతమైన వాతావరణనాన్ని స్థానిక బీజేపీ నేతలు చెడగొడుతున్నారని మత ఘర్షణలకు కారణం అవుతున్నారని విమర్శించారు. 2016లో జేపీ నడ్డా ఇచ్చిన హామీలను కూడా ఆయన తన లేఖలో ప్రస్తావించారు. ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ అంటూ వట్టిమాటలు చెప్పారని మండిపడ్డారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ నుంచి తమవైపు రాగానే బడుగులంతా బీజేపీలోనే అంటూ ఆ పార్టీ నేతలు చంకలు గుద్దుకున్నారు. మరుసటి రోజే బీజేపీ నుంచి బలహీన వర్గాలకు చెందిన భిక్షమయ్య గౌడ్ బయటకు వచ్చారు. బీసీ ఓట్లకు గాలమేయాలనుకుంటున్న బీజేపీ పాచిక పారలేదని అర్థమవుతోంది.

Exit mobile version