తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే (Caste Census Survey) మరోసారి నిర్వహించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ప్రకటించారు. ఇటీవల జరిగిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేలో రాష్ట్రంలోని 3.1 శాతం మంది పాల్గొనలేదని ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వంటి ప్రముఖులు కూడా ఈ సర్వేలో భాగం కాలేదని చెప్తోంది. అందుకే తుది గణాంకాలను ఖచ్చితంగా అందించేందుకు ఫిబ్రవరి 16 నుండి 18వ తేదీ వరకు మరోసారి కులగణన సర్వే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
Worlds Corrupt Countries: అవినీతిమయ దేశాల లిస్ట్.. భారత్ ఎక్కడ ? నంబర్ 1 ఏ దేశం ?
ఈ సర్వేపై ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో నివేదికను సమర్పించగా, రాష్ట్రవ్యాప్తంగా మిశ్రమ స్పందన లభించింది. కొన్ని ప్రాంతాల్లో అసలు సర్వే జరగలేదని, మరికొన్ని ప్రాంతాల్లో చాలా మంది పాల్గొనలేదని ప్రజలు తెలియజేశారు. అయితే మరో అవకాశం వస్తే తాము తప్పక సర్వేలో పాల్గొంటామని పలువురు విజ్ఞప్తులు చేయడంతో ప్రభుత్వం తిరిగి కులగణన సర్వే నిర్వహించేందుకు సిద్ధమైంది. బుధువారం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. ఈ సర్వేలో ప్రజలు టోల్ ఫ్రీ నంబర్, మండల కేంద్రాలు లేదా ఆన్‌లైన్ ద్వారా పాల్గొనవచ్చని తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ కులగణనలో భాగమయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్ వంటి నేతలకూ మరో అవకాశం ఇస్తున్నామని, వారు కూడా ఇందులో పాల్గొని తమ వివరాలు అందజేయాలని కోరారు.
ఈ కులగణన సర్వే అనంతరం ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తగిన చర్యలు చేపట్టనున్నట్టు భట్టి విక్రమార్క వెల్లడించారు. మార్చి మొదటి వారంలో కేబినెట్‌లో దీనిపై ఆమోదం తెలపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రిజర్వేషన్ల అమలుకు అవసరమైన చట్టాన్ని ప్రవేశపెట్టి, కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకునేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఈ బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రానికి పంపించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక బృందంగా వెళ్లనుంది. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను కలిసి, అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో దీన్ని చట్టబద్ధత కల్పించేందుకు ప్రయత్నిస్తామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.