Phone Tapping Case : ప్రతిపక్షాన్ని ఓడించేందుకే ‘ఫోన్ ట్యాపింగ్‌’ను వాడారు.. మాజీ పోలీసు అధికారి ‘ఒప్పుకోలు’

Phone Tapping Case :  తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నేతలు టార్గెట్‌గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు శరవేగంగా జరుగుతోంది. 

  • Written By:
  • Publish Date - April 2, 2024 / 08:57 AM IST

Phone Tapping Case :  తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నేతలు టార్గెట్‌గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు శరవేగంగా జరుగుతోంది.  ఈకేసులో(Phone Tapping Case) అరెస్టయిన టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ  రాధాకిషన్ రావు తన ఒప్పుకోలు స్టేట్‌మెంట్‌ (కన్ఫెషనల్ స్టేట్మెంట్)లో కీలక విషయాలను వెల్లడించినట్లు తెలిసింది. బేగంపేటలోని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) ఆఫీసు నుంచి దుగ్యాల ప్రణీత్ కుమార్ టీమ్ అందించిన నిఘా సమాచారం ఆధారంగానే గత ఐదేళ్లలో ఎన్నికల టైంలో నగదును స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. 2018 నుంచి 2023 మధ్యకాలంలో జరిగిన వివిధ ఎన్నికల సందర్భంగా ఎస్‌ఐబీ సహకారంతోనే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన టాస్క్ ఫోర్స్ విభాగం డబ్బులను సీజ్ చేసిందని రాధాకిషన్ రావు చెప్పారు. తన సిఫార్సు మేరకే గట్టు మల్లు అనే ఇన్‌స్పెక్టర్‌ను టాస్క్‌ఫోర్స్‌లోకి తీసుకున్నారని తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌లో రెండేళ్లు పనిచేసిన గట్టు మల్లు కొంతకాలం నారాయణగూడ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి తదుపరిగా ఎస్‌ఐబీలో చేరారు.

We’re now on WhatsApp. Click to Join

టార్గెట్ వీరే.. 

రాధాకిషన్ రావు నేరాంగీకార ప్రకటన ప్రకారం.. SIBలో కొత్తగా ఏర్పాటు చేసిన ‘స్పెషల్ ఆపరేషన్స్ టీమ్’కు అధిపతిగా ప్రణీత్ కుమార్‌ను నాటి ఎస్‌ఐబీ చీఫ్ టి.ప్రభాకర్ రావు ప్రత్యేకంగా ఎంచుకున్నారనే విషయం తనకు తెలుసని రాధాకిషన్ రావు చెప్పారు. విపక్ష నాయకులపై నిఘా కోసం ఈ టీమ్‌ను ఏర్పాటు చేశారన్నారు. బీఆర్ఎస్ పార్టీలోని తిరుగుబాటు అభ్యర్థులు, అసమ్మతివాదులపై ఈ విభాగం నిఘా ఉంచేదని ఆయన వివరించారు. ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులు, వారి మద్దతుదారులు, వ్యాపారస్తులతో పాటు బీఆర్‌ఎస్‌‌ను విమర్శించేవారు టార్గెట్‌గా ఈ బృందం నిఘా పెట్టిందని  వెల్లడించారు.‘స్పెషల్ ఆపరేషన్స్ టీమ్’లోని వారు తమ కార్యకలాపాలను ఇతరులు గమనించకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే వారని రాధాకిషన్ రావు చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా వాట్సాప్, సిగ్నల్, స్నాప్‌చాట్‌లలో మాత్రమే సంప్రదింపులు జరుపుకున్నట్లు రాధాకిషన్‌రావు పేర్కొన్నారు.

Also Read :Google: దొరికిపోయిన గూగుల్.. ‘ఇన్ కాగ్నిటో’లో డేటా చోరీ.. ఏం చేయబోతోందంటే..?

రికమెండేషన్‌తో పోస్టింగ్..

2017 సంవత్సరంలో నాటి ఎస్‌ఐబీ చీఫ్ టి.ప్రభాకర్ రావు సిఫార్సు మేరకు టాస్క్‌ఫోర్స్ డీసీపీగా  రాధాకిషన్ రావును అప్పటి సీఎం కేసీఆర్ నియమించారని రాధాకిషన్‌రావు రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. రాజకీయ, ఇతర కారణాల వల్ల హైదరాబాద్ నగరంపై పట్టును కొనసాగించడానికి ఈవిధమైన నియామకం జరిగిందని పేర్కొన్నారు. నల్గొండ నుంచి ప్రణీత్‌రావు, రాచకొండ కమిషనరేట్ నుంచి భుజంగరావు, హైదరాబాద్ సిటి నుంచి తిరుపతన్న, సైబరాబాద్ నుంచి వేణుగోపాల్‌రావును ఎస్‌ఐబీకి టి.ప్రభాకర్ రావు బదిలీ చేయించుకున్నారు.  నాటి ఎస్‌ఐబీ చీఫ్ టి.ప్రభాకర్ రావు దేశం విడిచి అమెరికాకు వెళ్లిపోగా.. ఫోన్ ట్యాపింగ్‌ సమాచారాన్ని వాడుకోవడంలో కీలకంగా వ్యవహరించిన అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ కలిగిన భుజంగరావు, తిరుపతన్నలను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.

Also Read :Israel Vs Iran : ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయెల్ ఎటాక్.. 11 మంది మృతి

ఎన్నికల వేళ ఫోన్ ట్యాపింగ్‌తో ఇలా.. 

  • టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలను పోలీసులు ప్రస్తావించారు.
  • ఫోన్ ట్యాపింగ్ సమాచారం ఆధారంగా 2018 ఎన్నికల సమయంలో రాంగోపాల్‌పేట పరిధిలోని ప్యారడైస్ వద్ద భవ్య సిమెంట్స్ అధినేత భవ్య ఆనంద్ ప్రసాద్‌కు చెందిన రూ. 70లక్షలను సీజ్ చేశారు. ఆ సమయంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఆయన పోటీ చేస్తున్నారు.
  • దుబ్బాక ఉప ఎన్నికల సమయంలోనూ ట్యాపింగ్ చేసిన సమాచారం ఆధారంగా రఘునందన్‌రావు బంధువులకు చెందిన కోటి రూపాయలను మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, ఆయన బృందం బేగంపేట పరిధిలో స్వాధీనం చేసుకుంది.
  • మునుగోడు ఉపఎన్నికల సమయంలోనూ ఈ సమాచారంతో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అనుచరులు అయిన గుంట సాయికుమార్‌రెడ్డి, మహేష్, వెన్నం భరత్‌లను అడ్డగించి వారి నుంచి రూ. 3.50 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.