Social Media Posts: కామెంట్‌ చేస్తే కటకటాలే.. సోషల్ మీడియాతో జర జాగ్రత్త!

చేతిలో ఫోన్‌ ఉంది కదా అని సామాజిక మాధ్యమాల్లో చిన్న వ్యాఖ్య పెట్టారా? ఎవరో పెట్టిన పోస్టు మీకు నచ్చలేదన్న కారణంతో కాస్త

  • Written By:
  • Updated On - September 23, 2022 / 01:13 PM IST

చేతిలో ఫోన్‌ ఉంది కదా అని సామాజిక మాధ్యమాల్లో చిన్న వ్యాఖ్య పెట్టారా? ఎవరో పెట్టిన పోస్టు మీకు నచ్చలేదన్న కారణంతో కాస్త కఠినంగా వ్యతిరేకించారా? పోలీసు కేసుల్లో ఇరుక్కునట్లే! ఇప్పటి వరకు సామాజిక మాధ్యమాల్లో మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు పెట్టిన వారిపైనే కేసులు పెడుతూ వచ్చిన పోలీసులు ఇప్పుడు పోస్టుల కింద కామెంట్లు పెడుతున్న వారినీ వెంటాడుతున్నారు. ఐటీ చట్టంతోపాటు ఐపీసీ కింద కూడా కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో డిజిటల్‌ పెట్రోలింగ్‌ను సైబర్‌ పోలీసులు ఉద్ధృతం చేశారు. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విషయంలోనూ ఇదే కారణంతో హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు ఐదుగురిపై కేసులు పెట్టారు.

పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారు, పాస్‌పోర్టులకు దరఖాస్తు చేసుకొనే వారు, విద్యార్థులు, యువత ఇటువంటి వాటిలో ఇరుక్కుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సంయమనం పాటించాలని స్పష్టం చేస్తున్నారు.సైబర్‌ పోలీసులు పలు చర్యలు తీసుకుంటున్నా సామాజిక మాధ్యమాల్లో అలజడి రేగుతోంది. ఈ నేపథ్యంలోనే సైబర్‌ గస్తీని మరింత ముమ్మరం చేశారు.

విద్వేషం పెంచేలా, వివాదాస్పద పోస్టులు పెడుతున్న వారిని, వాటిని షేర్‌ చేస్తున్న, స్పందించి అభ్యంతరకర కామెంట్లు పెడుతున్న వారిపై ‘సైబర్‌ పెట్రోలింగ్‌’ ద్వారా ఐటీ చట్టంతో పాటు.. 295ఎ, 153ఎ, 505, 506 తదితర నాన్‌బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఇలాంటి కేసుల్లో నేరం నిరూపితమైతే కనీసం రెండేళ్లకు తగ్గకుండా శిక్ష పడుతుంది. ఇప్పటికే కేసులు నమోదు చేసినా తీరు మార్చకోకుని వారిపై పీడీ యాక్టు ప్రయోగిస్తామని హైదరాబాద్‌ పోలీసులు తాజాగా హెచ్చరించారు.