Site icon HashtagU Telugu

Hyderabad : హైద‌రాబాద్‌లో గ్యాంగ్‌స్ట‌ర్ అయూబ్‌ఖాన్‌పై దోపిడీ కేసు న‌మోదు

Crime

Crime

హైదరాబాద్‌లో కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ అయూబ్‌ఖాన్‌పై దోపిడీ కేసు నమోదైంది. పాతబస్తీలో ఆస్తి వివాదంలో మహిళను బెదిరించినందుకు గాను పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ అయూబ్‌ఖాన్, అతని సహచరులపై హుస్సేనియాలం పోలీసులు దోపిడీ కేసు నమోదు చేశారు. ఖిల్వత్‌కు చెందిన 57 ఏళ్ల జమీలునిస్సా బేగం అనే మహిళ హుస్సేనియాలం పోలీసులకు ఫిర్యాదు చేసింది, రౌడీ షీటర్ అయూబ్ ఖాన్, అతని సహచరులు మేరాజ్ ఖాన్, మురాద్ నగర్‌కు చెందిన మున్నా, అన్సార్, అజర్ బాబాలు తనను బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించింది. బహదూర్‌పురా వద్ద MOC కాలనీలో ఉన్న ఆస్తితో పాటు 154 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఇంటిని ఖాళీ చేయమని.. లేకుంటే త‌న‌ను, త‌న కొడుకులను చంపేస్తామని గ్యాంగ్‌స్టర్ బెదిరించాడని ఆరోపించారు.

తాను ఇంటి యజమాని అయినప్పటికీ, గ్యాంగ్‌స్టర్ మహిళను బెదిరించి బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. హుస్సేనియాలం పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై IPC సెక్షన్ 384 (దోపిడీ) మరియు 511 కింద కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు. అయూబ్ ఖాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. డిసెంబర్ 28, 2022న కేసు నమోదైనప్పటికీ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. సెప్టెంబరు 2022లో, 2018లో నకిలీ పాస్‌పోర్ట్ కేసులో దోషిగా తేలిన అయూబ్ పహెల్వాన్ జైలు శిక్ష పూర్తయిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చాడు.

Exit mobile version