ప్రముఖ రచయిత కంచ ఐలయ్య 2000 సంవత్సరంలో వ్రాసిన “మనతత్వం” అనే పుస్తకంపై బేతి మహేందర్ రెడ్డి అనే వ్యక్తి కేసు వేశాడు. ఈ కేసుకు సంబంధిత కోర్టు సమన్లు ఇచ్చింది. కంచ ఐలయ్యకు కరీంనగర్ ఎడిషనల్ సెషన్ కోర్టు.. అక్టోబర్ 12వ తేదీన కోర్టులో హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. ఈ పుస్తకం 1998 నుండి 2000 సంవత్సరం వరకు ఆంధ్రప్రభ వారపత్రికలో వరుసగా ప్రచురింపబడింది. తర్వాత 2000 సంవత్సరంలో అది పుస్తకంగా అచ్చు వేయబడింది.
వార పత్రికలో అచ్చు అవుతున్న సమయంలోనే దీనిపై చాలా చర్చ జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు పుస్తకం 3 ముద్రణలు అచ్చువేసి లక్షలాది మంది చేతుల్లోకి వెళ్లిపోయింది. అయితే.. బేతి మహేందర్ రెడ్డి అనే వ్యక్తి తాను క్షత్రియుడనని చెప్పుకుని తనకు అవమానం జరిగిందని కేసు వేశాడు. ఈ పుస్తకం గత 22 ఏళ్లుగా లక్షల మందిని చైతన్యపరిచింది. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంస్కృతిని, విలువలను, సమాజ చట్టాలను కళ్లకు కట్టినట్లు పరిశీలించింది.
దీనిపై ఇప్పుడు కేసు వేయడంపై దళిత, బహుజనులకు ప్రశ్నార్థకమైంది. 2017 సంవత్సరంలో ఇలాగే ఐలయ్య రాసిన మరో పుస్తకంపై కేసు వేసిన క్రమంలో కోరుట్ల కోర్టుకు హాజరైన క్రమంలో కోర్టు ఆవరణలోనే రచయితపై దాడికి యత్నాలు జరిగాయి. తాజాగా మరో పుస్తకంపై కూడా కేసు వేయడంతో కరీంనగర్ కోర్టు వద్ద బుధవారం ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.