BRS Party : `కారు` క్లోజ్! బీఆర్ఎస్ సింబ‌ల్ క్యా హై!

వెట‌రన్ పొలిటిషియ‌న్ కేసీఆర్ (KCR) మ‌రో ప్ర‌స్తానంకు తెర‌లేపారు. ఉద్య‌మం నుంచి ఫ‌క్తు రాజ‌కీయం చేసిన మాంత్రికుడు.

  • Written By:
  • Updated On - December 10, 2022 / 12:05 PM IST

వెట‌రన్ పొలిటిషియ‌న్ కేసీఆర్ (KCR) మ‌రో ప్ర‌స్తానంకు తెర‌లేపారు. ఉద్య‌మం నుంచి ఫ‌క్తు రాజ‌కీయం చేసిన మాంత్రికుడు. ఇప్పుడు భార‌త రాష్ట్ర స‌మితికి (BRS) ప్రాణం పోయ‌డానికి ముహూర్తం పెట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితిని సమాధి చేయ‌డంతో పాటు భార‌త రాష్ట్ర స‌మితి (BRS)కి పురుడు పోయ‌డానికి గురువారం మ‌ధ్యాహ్నం స‌రిగ్గా 1.20 నిమిషాల‌కు శుభ‌గ‌డియ‌గా నిర్ణ‌యించారు. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న కారు గుర్తు(Symbol)ను బీఆర్ఎస్ కు కొన‌సాగిస్తారా? లేదా? అనేది పెద్ద ప్ర‌శ్న‌.

సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేసీఆర్ ఎన్నిక‌ల క‌మిష‌న్ వ‌ద్ద టీఆర్ఎస్ పార్టీ విలీనం ప్ర‌క్రియ‌ను పెట్టారు. ఇటీవ‌ల నిర్వ‌హించిన రాష్ట్ర కార్య‌వ‌ర్గం తీర్మానం, శాస‌న స‌భాప‌క్ష , మంత్రుల మండ‌లి తీర్మానం త‌దిత‌రాల‌ను ఈసీకి. అందించారు. భార‌త రాష్ట్ర స‌మితి రిజిస్ట్రేష‌న్ తో పాటు దానిలో టీఆర్ఎస్ విలీనం జ‌రిగిన‌ట్టు ఎన్నిక‌ల క‌మిష‌న్ గుర్తిస్తూ లేఖ‌ను రాసింది. విచిత్రంగా హైద‌రాబాద్ ను ఇప్ప‌టికీ ఏపీ రాష్ట్రం కింద గుర్తిస్తూ ఎన్నిక‌ల కమిష‌న్ కేసీఆర్ కు తిరుగు లేఖ రాసింది. అడ్ర‌స్ తో పాటు బీఆర్ఎస్ సింబ‌ల్ (BRS Symbol) విష‌యంలో ఈసీ ఎలా వ్య‌వ‌హ‌రిస్తుంది? అనేది ఇప్పుడు స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న అనుమానం.

సాధార‌ణంగా కొత్తగా ఒక పార్టీని రిజిస్ట్రేష‌న్ చేసుకుంటే ఎన్నిక‌ల క‌మిష‌న్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఓట్లు, సీట్లు వ‌స్తేనే గుర్తింపు ఉంటుంది. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌లేదు. కానీ, మునుగోడు ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భాన్ని, భ‌విష్య‌త్ ను తేల్చుతాయ‌ని కేసీఆర్ ఎన్నిక‌ల స్లోగ‌న్ గా తీసుకున్నారు. అక్క‌డ విజ‌యం సాధించ‌డంతో ఇక బీఆర్ఎస్ ముందుకు సాగుతుంద‌ని నాలుగురోజుల క్రితం జ‌రిగిన మ‌హ‌బూబ్ న‌గ‌ర్ బ‌హిరంగ స‌భ‌లో వెల్ల‌డించారు. ఆయన ప్ర‌క‌ట‌న‌కు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ ని గుర్తిస్తూ ఈసీ లేఖ కేసీఆర్ అందింది. దీంతో అధికారికంగా పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం పెట్టారు.

ఒక‌ప్పుడు ప్రాంతీయవాదాన్ని ఎక్కించి తెలంగాణ స‌మాజాన్ని మ‌రిపించారు. దాన్ని అట‌కెక్కించి అమ‌రుల కుటుంబాల‌ను రోడ్డున ప‌డేసినా తెలంగాణ ప్ర‌జ‌లు ఆయ‌న ప‌క్షాన నిలిచారు. ఫ‌క్తు రాజ‌కీయాలకు ఇక ప‌రిమితం అన్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు ఆయ‌న వెంట న‌డిచారు. ఇక తెలంగాణ ఫ‌క్తు రాజ‌కీయాల‌ను దేశానికి విస్త‌రింప చేయ‌డానికి మెట్టుగా వేసుకున్నారు. అయిన‌ప్ప‌టికీ తెలంగాణ ఓట‌ర్లు ఆయ‌న వెంట న‌డవ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని ఇటీవ‌ల జ‌రిగిన మునుగోడు ఫ‌లితాలు చెబుతున్నాయి. అయితే, రాబోవు రోజుల్లో స‌మైక్య‌వాదాన్ని వినిపించే కేసీఆర్ ను తెలంగాణ ప్ర‌జ‌లు ఆద‌రిస్తారా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

గురువారం మధ్యాహ్నం 1.20 గంటలకు దివ్య ముహూర్తంలో బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వ‌హించ‌డానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన లేఖపై కేసీఆర్ సంతకం చేయనున్నారు. ఆ మరుక్షణమే బీఆర్ఎస్ పార్టీ ఉనికిలోకి వస్తుంది. టీఆర్ఎస్ కనుమరుగు కానుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జెండాను కేసీఆర్ ఆవిష్కరించ‌నున్నారు. అనంతరం కార్యాచరణపై కీలక నేతలతో కేసీఆర్ చర్చించి ఎజెండాను ఫిక్స్ చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, జిల్లాల అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డీసీసీబీ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యలంతా హాజరు కావ‌డానికి హైద‌రాబాద్ లోని తెలంగాణ భవన్ కు చేరుకున్నారు.

Also Read:  Russia – America : అమెరికా జైలు నుంచి ‘మృత్యు వ్యాపారి’ బయటకు