Bandi Sanjay: మోడీలేని భారత్ ను ఊహించలేం, తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు మావే: బండి

  • Written By:
  • Updated On - January 3, 2024 / 04:19 PM IST

Bandi Sanjay: ప్రధాని నరేంద్ర మోదీ వర్సెస్ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అనే నినాదంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. దేశవ్యాప్తంగా ఏ సంస్థ సర్వే చేసినా.. 80 శాతానికి పైగా ప్రజలు మళ్లీ మోదీయే ప్రధాని కావాలని కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణలోనూ 8 నుంచి 12 ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని చెప్పారు. బీఆర్ఎస్ 3వ స్థానానికి పడిపోవడం ఖాయమన్నారు.

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగోలేదని, ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు చెల్లించలేక పోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు సీఎం, మంత్రులు చెబుతున్న కొత్త హామీలు అమలు కావడం లేదన్నారు. ఇప్పుడు కొత్త మంత్రులు కొత్త వాగ్దానాలు చేస్తున్నారని, వాటిని ఎలా అమలు చేయాలో తెలియడం లేదు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ముఖంలో చిరునవ్వు లేదని బండి సంజయ్ అన్నారు. దేశ వ్యాప్తంగా మోడీ హవా ఉందని, ఈసారి బీజేపీకి 350 ఓట్లు వస్తాయని అన్నారు. ఎన్డీయే కూటమి 400కు పైగా సీట్లు గెలుచుకోనుంది.

మోదీ లేని భారతదేశాన్ని ఎవరూ ఊహించలేరు. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో ఈసారి ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉంటుందని, పొరపాటున ఎవరైనా బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే అది మురికి కాలువలో వేసినట్లేనని అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎంపీలు గెలిచినా కేంద్రం నుంచి నిధులు తెచ్చే పరిస్థితి లేదు. బీజేపీ అభ్యర్థులు గెలిస్తే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన నిధులకు అదనంగా నిధులు మంజూరు చేయనుంది.