Site icon HashtagU Telugu

Ration Cards: తెలంగాణలో వారి రేషన్ కార్డుల రద్దు!

Ration Cards

Ration Cards

Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల (Ration Cards) రద్దు ప్రక్రియ ఊపందుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ధ్రువీకరణ డ్రైవ్‌లో అర్హత లేని 76,842 రేషన్ కార్డులను రద్దు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. వలస వెళ్లినవారు, డూప్లికేట్ కార్డులు, మరణించిన వ్యక్తుల పేరిట ఉన్న కార్డులు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ చర్య ద్వారా సంక్షేమ పథకాలు అర్హులకు మాత్రమే అందేలా పారదర్శకతను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

గత ఆరు నెలలుగా రేషన్ సరుకులు తీసుకోని 1.59 లక్షల కార్డులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించగా, రాష్ట్ర ప్రభుత్వం విచారణ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. అర్హత లేని లబ్ధిదారులను తొలగించేందుకు e-KYC ధ్రువీకరణను తప్పనిసరి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియను జూన్ 30, 2025 నాటికి పూర్తి చేయాలని నిర్దేశించారు. లేనట్లయితే కార్డులు రద్దయ్యే అవకాశం ఉంది.

సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. జనవరి 26, 2025 నుంచి కొత్త కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించిన ప్రభుత్వం, 2.03 లక్షల కొత్త కార్డులను మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారుల సంఖ్య 3.11 కోట్లకు చేరుకుంది. ఇది జనాభాలో దాదాపు 80 శాతం.

Also Read: The Strait Of Hormuz: స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ అంటే ఏమిటి? చ‌మురు ధ‌ర‌ల‌పై ప్ర‌భావం ప‌డ‌నుందా?

అయితే, రేషన్ కార్డుల జారీలో అవినీతి, మధ్యవర్తుల జోక్యం పెరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల్లో 2.66 లక్షల దరఖాస్తుల్లో కేవలం 10 శాతం మాత్రమే ఆమోదం పొందాయి. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేషన్ కార్డు అప్‌లోడ్ కోసం రూ.2,500 లంచం తీసుకుంటూ ఒక టైపిస్టును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.

మరోవైపు, సన్న బియ్యం పంపిణీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డుల జారీలో నిర్లక్ష్యం జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. త్వరలో 17 లక్షల కొత్త కార్డులను జారీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.