Site icon HashtagU Telugu

ED – Kavitha : అప్పటిదాకా విచారణకు రాను.. ఈడీకి స్పష్టం చేసిన కవిత

Ed Kavitha

Ed Kavitha

ED – Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఇవాళ(మంగళవారం) విచారణకు  హాజరుకావాలని కోరింది.  అయితే దీనిపై కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ విచారణకు హాజరుకాలేనని ఈడీకి కవిత తెలియజేశారు. ఈడీ నోటీసులపై తాను  ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించానని.. దానిపై పిటిషన్ పెండింగ్‌లో ఉండగా విచారణకు రాలేనని స్పష్టం చేశారు. ఈమేరకు ఈడీ అధికారులకు కవిత లేఖ రాశారు. దీనిపై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చేవరకు.. విచారణకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. దేశంలో సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించి గతంలోనూ కవితకు ఈడీ సమన్లు జారీ చేసింది.  గతేడాది మార్చిలో మూడు రోజుల పాటు కవితను ఈడీ(ED – Kavitha) విచారించింది.

We’re now on WhatsApp. Click to Join.

అయితే ఈడీ నోటీసులు, విచారణ పద్ధతిపై కవిత గతంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహిళనైన తనను విచారణ కోసం.. ఈడీ ఆఫీసుకు పిలిచి రాత్రి వరకు విచారణ చేయటాన్ని వ్యతిరేకిస్తూ.. సుప్రీం కోర్టులో కవిత పిటిషన్ వేశారు. ఈడీ కార్యాలయంలో మహిళల విచారణ సీఆర్సీసీకి విరుద్ధం అంటూ కవిత మొదటి నుంచి వాదిస్తున్నారు. నళిని చిదంబరం తరహాలో ఇంటివద్దే తనను కూడా విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పిటిషన్‌ సుప్రీం కోర్టు విచారణలో ఉన్న సమయంలోనే.. గతేడాది సెప్టెంబర్‌లో ఈడీ మళ్లీ నోటీసులు పంపటంతో.. కవిత కూడా అదే వాదనతో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనకు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే స్పందించిన సుప్రీం కోర్టు.. గతేడాది నవంబర్ 20 వరకు కవితకు ఎలాంటి నోటీసులు జారీ చేయొద్దని ఈడీకి ఆదేశాలిచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో నవంబర్ 20 వరకు ఎమ్మెల్సీ కవితను విచారణకు పిలవబోమని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అప్పట్నుంచి ఈ కేసులో కవితకు ఎలాంటి నోటీసులు రాలేదు. తాజాగా ఇప్పుడు నోటీసులిచ్చారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు వస్తున్న క్రమంలో.. కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

Also Read: Divy Ayodhya : ‘దివ్య్‌ అయోధ్య’.. అయోధ్య రామయ్య భక్తులకు మరో సౌకర్యం

ఇక ఇదే కేసుకు సంబంధించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రెండు రోజుల కిందట నాలుగోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈడీ సమన్లపై గతంలో స్పందించిన అరవింద్ కేజ్రీవాల్ తాను సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే తనను అరెస్టు చేయడమే ఈడీ ఉద్దేశమని చెప్పారు. కీలకమైన పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ లిక్కర్ కేసులో ఈడీ దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. తాజాగా కవితకు నోటీసులు ఇవ్వటంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.