Munugodu Elections: మునుగోడు క్లైమాక్స్ హోరు

మునుగోడు ఉప ఎన్నిక‌ల ప్ర‌చారం దాదాపుగా ముగిసింది. మూడు ప్ర‌ధాన పార్టీలు ఆయా వ‌ర్గాల‌ను ఆకర్షించడానికి స‌ర్వ శ‌క్తుల‌ను ఒడ్డారు.

  • Written By:
  • Updated On - November 1, 2022 / 12:35 PM IST

మునుగోడు ఉప ఎన్నిక‌ల ప్ర‌చారం దాదాపుగా ముగిసింది. మూడు ప్ర‌ధాన పార్టీలు ఆయా వ‌ర్గాల‌ను ఆకర్షించడానికి స‌ర్వ శ‌క్తుల‌ను ఒడ్డారు. ప్ర‌ధానంగా యువ‌త బీజేపీ వైపు ఉంద‌ని ఆ పార్టీ భావిస్తోంది. మ‌హిళ‌లు ఎక్కువ‌గా కాంగ్రెస్ అభ్య‌ర్థి స్ర‌వంతి రెడ్డిని ఆదరిస్తున్నారని ఆ పార్టీ విశ్వ‌సిస్తోంది. సంక్షేమ ప‌థ‌కాన‌లను అందుకున్న ప్ర‌తి ఓట‌రు ఓటేస్తార‌ని టీఆర్ఎస్ అంచ‌నా వేస్తోంది. మూడు పార్టీలు మూడు విధాలుగా గెలుపు మీద ఆశ‌లు పెట్టుకోవ‌డం మునుగోడు ఉప ఎన్నిక‌ల్లోని హైలెట్ పాయింట్‌.

ఇప్ప‌టి వ‌ర‌కు అనుకూల ఓటింగ్ ను పెంచుకోవ‌డానికి ప్ర‌ధాన పార్టీలు ప్ర‌య‌త్నం చేయ‌గా, చివ‌రి రోజు ప్ర‌త్య‌ర్థుల బ‌లం మీద కన్నేయ‌డం గ‌మ‌నార్హం. యువ‌త బీజేపీ వైపుగా మొగ్గుచూపుతోంద‌ని గ్రహించిన టీఆర్ఎస్ చివ‌రి రోజు ఆ వ‌ర్గాన్ని ఆక‌ర్షించ‌డానికి మంత్రులు హ‌రీశ్‌, కేటీఆర్ ల‌ను ప్ర‌యోగించింది. చివరిసారిగా కేటీఆర్ అక్టోబరు 23న ఘట్టుప్పల్‌లో ప్రచారం చేయగా, హరీశ్‌రావు అక్టోబర్‌ 26న ప్రచారం నిర్వహించారు. అప్పటి నుంచి ఇద్దరు నేతలు ప్రచారానికి దూరంగా ఉన్నారు. ప్రగతి భవన్‌, తెలంగాణ భవన్ కేంద్రంగా వివిధ వర్గాల ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేత‌ల‌తో వ్యూహాల‌ను రచించ‌డానికి ప‌రిమితం అయ్యారు. అయితే, యువ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డానికి హ‌రీశ్‌, కేటీఆర్ ల‌తో రోడ్ షోల‌ను ప్ర‌చారం చివ‌రి రోజున నల్గొండ నేత‌లు ప్లాన్ చేశారు.

Also Read:   Munugode Bypoll: నేటితో మునుగోడు ప్రచారానికి తెర..!

రామారావు, హరీశ్‌రావులను మునుగోడుకు పంపించి వీలైనన్ని మండలాల్లో రోడ్‌షోలు నిర్వహించాలని న‌ల్గొండ నేత‌లు పార్టీ అధిష్టానాన్ని కోరారు. మునుగోడులోని 2.4 లక్షల మంది ఓటర్లలో దాదాపు సగానికి పైగా 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల యువ ఓటర్ల ఉన్నారు. మొదటిసారి యువ ఓటర్లను ఆకర్షించడానికి రామారావు ప్రత్యేకంగా రోడ్ షోలు నిర్వహించాలని ఫిక్స్ అయ్యారు. కమ్యూనిస్టు ఓటు బ్యాంకును టీఆర్‌ఎస్‌కు బదిలీ చేసేందుకు హరీశ్‌రావు వామపక్ష పార్టీల ఎన్నికల ఇంచార్జ్‌లు, బూత్‌ ఇంచార్జ్‌లతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని జిల్లా పార్టీ నేతలు కోరారు.

Also Read:   Congress no Ties: టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదు.. రాహుల్ క్లారిటీ!

ఆదివారం చండూరులో కేసీఆర్ చేపట్టిన ర్యాలీ విజయవంతం కావడంతో ఉత్సాహంగా గులాబీ టీమ్ ఉంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బహిరంగ సభ ఆ పార్టీ అవకాశాలను పెంచింది. అయిన‌ప్ప‌టికీ మంత్రులు కె.టి. రామారావు, టి.హరీష్‌రావులు గెలుపు అవ‌కాశాల‌ను మ‌రింత మెరుగుప‌రుచుకోవ‌డానికి మంగ‌ళ‌వారం ప్రచారానికి దిగారు. చివ‌రి నిమిషం వ‌ర‌కు స‌ర్వ‌శ‌క్తుల‌ను టీఆర్ఎస్ ఒడ్డుతోంది. ఇంకో వైపు బీజేపీ ఆశించిన విధంగా ప్ర‌చారం చేయ‌డంలో విఫలం అయింది. మునుగోడు ప్ర‌చారంలో భాగంగా జాతీయ బీజేపీ అధ్య‌క్షుడు న‌డ్డా ప్ర‌చారానికి వ‌స్తార‌ని భావించారు. ఆయ‌న‌తో బ‌హిరంగ స‌భ ఉంటుంద‌ని షెడ్యూల్ చేశారు. కానీ, ఆయ‌న ప్ర‌చారానికి రాలేదు. తెలంగాణ బీజేపీ లీడ‌ర్లు మిన‌హా ఢిల్లీ బీజేపీ పెద్ద‌గా ప్ర‌చారం చివ‌రి రోజుల్లో ప‌ట్టించుకోలేదు. పైగా అభ్య‌ర్థి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి జ్వ‌రం అంటూ కొన్ని రోజులు ఉత్సాహంగా ముందుకు వెళ్లలేక‌పోయారు.

కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి ఒంట‌రి పోరు చేస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, అభ్య‌ర్థి స్ర‌వంతి రెడ్డి క్షేత్ర‌స్థాయిలో నిత్యం క‌నిపించారు. మిగిలిన సీనియ‌ర్ లీడ‌ర్లు అడ‌పాద‌డ‌పా కొంద‌రు క‌నిపించారు. స్థానిక ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ బీజేపీ అభ్య‌ర్థి రాజ‌గోపాల్ రెడ్డికి మ‌ద్ధ‌తు ఇచ్చారు. ఆర్థికంగా కూడా బాగా కాంగ్రెస్ వెనుక‌బ‌డింది. మ‌హిళా ఓట‌ర్ల సానుభూతిని బాగా న‌మ్ముకుంది. ఉప ఎన్నిక‌ల కీల‌క ద‌శ‌లో రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర తెలంగాణ‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ ఎక్కువ‌గా జోడో యాత్ర విజ‌య‌వంతం కోసం స‌ర్వ‌శ‌క్తుల‌ను ఒడ్డింది. ప్ర‌చారం చివ‌రి రోజు కూడా పెద్ద‌గా కాంగ్రెస్ పార్టీ ముందుకు కద‌లేక‌పోయింది. బీజేపీ, టీఆర్ఎస్ మాత్రం ఆర్థికంగా పోటీప‌డి ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ పెట్టారు. బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ బైక్ ర్యాలీని మంగ‌ళ‌వారం రోజున భారీగా నిర్వ‌హించారు. మొత్తం మీద ప్ర‌చారం చివ‌రి రోజు ఎవ‌రికి వారే ప్ర‌త్య‌ర్థుల బలం మీద దెబ్బ వేసే ప్ర‌య‌త్నం చేస్తూ హోరెత్తించారు.

Also Read:   AP Formation Day: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆవిర్భావ దినోత్స‌వం.. పొట్టి శ్రీరాముల‌కు నివాళ్లర్పించిన సీఎం జ‌గ‌న్‌