KCR Cloud Burst : కేసీఆర్ చెప్పిన‌ `క్లౌడ్ బ‌ర‌స్ట్‌` క‌థ‌

తెలంగాణ సీఎం కేసీఆర్ `మాట‌కారిత‌నం` స‌ర్వ‌త్రా తెలిసిందే. ఆయ‌న్ను మాటల మాంత్రికుడిగా చెప్పుకుంటారు.

  • Written By:
  • Publish Date - July 19, 2022 / 03:03 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ `మాట‌కారిత‌నం` స‌ర్వ‌త్రా తెలిసిందే. ఆయ‌న్ను మాటల మాంత్రికుడిగా చెప్పుకుంటారు. ప్ర‌త్య‌ర్థులు మాత్రం ప‌చ్చి అబ‌ద్దాల కోరని విమ‌ర్శిస్తుంటారు. ఆంద్రోళ్ల‌ను టార్గెట్ చేసి ఉద్య‌మాన్ని న‌డిపారు. ప్ర‌త్యేక రాష్ట్రాన్ని సాధించిన త‌రువాత 2014 నుంచి సీఎంగా కొన‌సాగుతున్నారు. గ‌త ఏడాది కురిసిన‌ వ‌ర్షాల కార‌ణంగా హైద‌రాబాద్ మునిగిపోవ‌డానికి కార‌ణం ఆంధ్రా పాల‌కుల చేత‌గానిత‌నంగా కేసీఆర్ చెప్పారు. ద‌శాబ్దాలుగా ఆంధ్రోళ్లు ఆక్ర‌మించిన నాలాల వ‌ల‌న‌ హైద‌రాబాద్ మునిగిపోయింద‌ని న‌మ్మించారు. ఇప్సుడు తెలంగాణ వ్యాప్తంగా కురిసిన వ‌ర్షాల వెనుక విదేశీ కుట్ర ఉంద‌ని కేసీఆర్ సంచ‌ల‌న కామెంట్ చేయ‌డం గ‌మ‌నార్హం.

`క్లౌడ్ బ‌ర‌స్ట్‌`ద్వారా వ‌ర్షాలు భారీగా కురిసేలా విదేశ‌స్తులు కుట్ర చేశార‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పిన లేటెస్ట్ మాట‌. అదే, ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఆయ‌న వాడిన `క్లౌడ్ బ‌ర‌స్ట్‌` గురించి గూగుల్ సెర్చ్ చేస్తున్న తెలుగు వాళ్ల సంఖ్య కూడా పెరిగింది. ఇంత‌కీ, కేసీఆర్ చెప్పిన `క్లౌడ్‌ బ‌ర‌స్ట్ ` ఏమిటంటే, 30 చ‌. కీ.మీ వ్యాసార్థంలో ఎక్క‌డైనా అత్య‌ధికంగా 10 సెంటీమీట‌ర్లు వ‌ర్ష‌పాతం న‌మోదు కావ‌డాన్ని క్లౌడ్ బ‌ర‌స్ట్ అంటార‌ని కేంబ్రిడ్జి యూనివ‌ర్సిటీ నిఘంట‌వు చెబుతోంది. స్వ‌ల్ప ప‌రిధిలో రెండు గంట‌ల పాటు క‌నీసం 5 సెంటీమీట‌ర్ల వ‌ర్షం కురిస్తే దాన్ని మినీ క్లౌడ్ బ‌ర‌స్ట్ అంటారు. భార‌త వాతావ‌ర‌ణశాఖ ప్ర‌కారం 1970 నుంచి 2016 వ‌ర‌కు దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో 30 చోట్ల క్లౌడ్ బ‌రస్ట్ లు సంభ‌వించాయి. తాజాగా అమ‌ర్ నాథ్ గ‌హ వ‌ద్ద జ‌రిగిన క్లౌడ్ బ‌ర‌స్ట్ కార‌ణంగా 16 మంది మ‌ర‌ణించారు. 2002లో ఉత్త‌రాంచ‌ల్ లో కురిసిన కుంభ‌వృష్టి 30 మందిని బ‌లితీసుకుంది. భార‌త‌దేశంలోని ఎత్తైన ప్రాంతాలుగా ఉన్న హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌, జ‌మ్మూక‌శ్మీర్ ప్రాంతాల్లో మాత్ర‌మే `క్లౌడ్ బ‌ర‌స్ట్` జ‌రిగింది. ఆ మేర‌కు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. ఇప్పుడు తెలంగాణాలోనూ ఇదే ప‌రిస్థితి అంటూ కేసీఆర్ చెప్ప‌డానికి ఎలాంటి ఆధార‌మూ లేక‌పోవ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

క్లౌడ్ బ‌ర‌స్ట్‌, క్లౌడ్ సీడింగ్ కు తేడా తెలియ‌ని కేసీఆర్ 80వేల పుస్త‌కాలు ఎలా చ‌దివాడ‌ని బీజేపీ తాజా లీడ‌ర్ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి ప్ర‌శ్నిస్తున్నారు. అప‌ర‌మేధావిగా చెప్పుకునే కేసీఆర్ వ‌ర‌ద‌ల కార‌ణంగా మునిగిపోయిన తెలంగాణను ఆదుకోలేక‌ విదేశీ కుట్రంటూ త‌ప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. దేశ వ్యాప్తంగా క‌నిపిస్తున్న మేఘ విస్ఫోటనాలు అంతర్జాతీయ కుట్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు వాదించ‌డం విచిత్రంగా ఉంది.
గతంలో లేహ్, లడఖ్, ఉత్తరాఖండ్‌లో వాళ్లు (ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తులు) మేఘ విస్ఫోటనాలు చేశారని, ఇప్పుడు గోదావరి నది పరిసర ప్రాంతాల్లో మేఘాల విస్ఫోటనం చేస్తున్నట్లు మాకు సమాచారం అందిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

క్లౌడ్ సీడింగ్‌(మేఘ‌మ‌థ‌నం) తెలుగు రాష్ట్రాల‌కు బాగా తెలుసు. ఎందుకంటే, 2004లో అధికారంలోకి వ‌చ్చిన సీఎం వైఎస్ ఆర్ మేఘ మ‌థ‌నం కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఆ రోజున వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రిగా ఉన్న ర‌ఘువీరారెడ్డి ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక విమానాలతో మేఘ‌మ‌థ‌నం చేయ‌డం ద్వారా వ‌ర్షాలు కురిసిన విష‌యం విదిత‌మే. ఆ త‌రువాత ఇప్ప‌టి వ‌ర‌కు క్లౌడ్ సీడింగ్‌, క్లౌడ్ బ‌ర‌స్ట్ అనే పదాల‌ను విన‌లేదు. హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో వైఎస్ఆర్ మ‌ర‌ణం త‌రువాత క్యుమునోలింబ‌స్ మేఘాల‌ను విన్నాం. తాజాగా క్లౌడ్ బ‌ర‌స్ట్ అంటూ కేసీఆర్ చెప్ప‌డాన్ని ప్ర‌త్య‌ర్థి పార్టీలు, సైంటిస్ట్ లు సైతం విశ్వ‌సించ‌డంలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని వ‌ర‌ద‌ల నుంచి కాపాడుకునే వ్య‌వ‌స్థ లేక‌పోవ‌డంతో కేసీఆర్ డ్రామాలు మొద‌లు పెట్టార‌ని బీజేపీ , కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు.

ప్ర‌త్యామ్నాయ ఎజెండా అంటూ జాతీయ రాజ‌కీయ‌ల గురించి ప్ర‌స్తావిస్తోన్న కేసీఆర్ ఇప్పుడు వ‌ర్షాల‌కు విదేశీ కుట్ర‌ను జోడించారు. చైనా, భార‌త్ భూమిని ఆక్ర‌మించుకున్నార‌ని కొన్ని నెల‌ల క్రితం ఆరోపిస్తూ భార‌త ఆర్మీ బ‌లాన్ని ప్ర‌శ్నించేలా మాట్లాడారు. కంటోన్మెంట్ ఏరియాకు క‌రెంట్‌, నీళ్లు క‌ట్ చేస్తామంటూ మంత్రి కేటీఆర్ జాతీయ స్థాయికి పోరుకు దిగారు. రెండు ద‌శాబ్దాల పాటు ఆంధ్రోళ్ల అన్యాయ‌మంటూ గ‌ళ‌మెత్తిన కేసీఆర్ ఇప్పుడు ద‌క్షిణ భార‌త‌దేశంపై కుట్ర అనే అస్త్రాన్ని అందుకున్నారు. తాజాగా వ‌ర్షాల‌కు కూడా విదేశీ కుట్ర‌ను జోడించ‌డం జాతీయ స్థాయిలో ఆయ‌న కామెంట్ల‌పై చ‌ర్చ‌నీయాంశం అయింది.