Cabinet Meeting : గత బీఆర్‌ఎస్ పాలనలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం రూపకల్పన, నిర్మాణం, అమలులో చోటుచేసుకున్న అక్రమాలు, లోపాలపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని విచారణ కమిషన్ సమర్పించిన 650 పేజీల నివేదికపై తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నేడు (సోమవారం) చర్చ పెట్టనున్నారు. ఇప్పటికే ఈ నివేదిక సారాంశాన్ని సిద్ధం చేయడం కోసం ప్రత్యేకంగా నియమించబడిన ముగ్గురు సభ్యుల సీనియర్ అధికారుల కమిటీ ఆదివారం సాయంత్రం నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమావేశమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు కూడా హాజరై, సారాంశ నివేదిక తుది రూపును ఆమోదించారు. ఈ కమిటీలో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, న్యాయ కార్యదర్శి రెండ్ల తిరుపతి, GAD కార్యదర్శి ఎం. రఘునందన్ రావు సభ్యులుగా ఉన్నారు.
Read Also: Jharkhand : ఝార్ఖండ్ మాజీ సీఎం శిబూసోరెన్ కన్నుమూత
వర్గాల సమాచారం మేరకు కమిషన్ నివేదికలో ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, మాజీ నీటిపారుదల మంత్రి టి. హరీష్ రావు, అప్పటి ఆర్థిక మంత్రి (ప్రస్తుతం బీజేపీ ఎంపీ) ఈటల రాజేందర్‌లపై తీవ్ర ఆరోపణలు నమోదయ్యాయి. వీరంతా పథకంలో భారీ అవకతవకలకు పాల్పడ్డారని, నిర్మాణ పనుల్లో నాణ్యతలేమి, ప్రతిపాదనల తేడా, ప్రణాళిక లోపాలు ఉన్నాయని వివరంగా పేర్కొనబడింది. ముఖ్యంగా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణాల్లో గణనీయమైన నిర్మాణ నష్టాలు నమోదయ్యాయని, ప్రజాధనానికి భారీ నష్టం వాటిల్లిందని నివేదిక చెబుతోంది. ఇక, మంత్రివర్గం ఈ నివేదికపై పూర్తి స్థాయిలో చర్చించి, ఆమోదం తెలిపిన అనంతరం అసెంబ్లీలో నివేదికను ప్రవేశపెట్టేందుకు చర్యలు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల రెండవ లేదా మూడవ వారంలో అసెంబ్లీ సమావేశం జరగనున్నదని అంచనా. అక్కడ వివరణాత్మక చర్చ అనంతరం, అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత, నివేదికలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ సహా పలు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ అంశంపై చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అవకతవకలు వెలుగులోకి రావడం వల్ల రాజకీయంగా, చట్టపరంగా ప్రత్యర్థులను నిలదీయడంలో ఈ నివేదిక కీలక పాత్ర పోషించనుంది. ముఖ్యంగా, కేంద్రం వద్ద నిధుల విషయాల్లోనూ, భవిష్యత్తులో అంతర్గత దర్యాప్తుల నిర్వహణలోనూ ఇది ప్రభుత్వం తరఫున ఒక బలమైన ఆధారంగా నిలవనుంది. కమిషన్ చేసిన కొన్ని సిఫార్సుల్లో నేరపూరిత చర్యలు, ప్రభుత్వ నష్టపరిహార పద్ధతులు, బాధ్యులపై విచారణలు, బాధ్యత వహించాల్సిన అధికారులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నవే ఉన్నట్లు సమాచారం. కేసు రాజకీయ ప్రాధాన్యతతో పాటు ప్రజల నిధుల దుర్వినియోగాన్ని స్పష్టంగా తేటతెల్లం చేయడంతో, రానున్న రోజుల్లో ఇది తెలంగాణ రాజకీయాల్లో ఓ కీలక మలుపు కావచ్చు.
Read Also: Komatireddy Rajagopal Reddy : నా మద్దతు మీకే.. మరోసారి సీఎం రేవంత్ కు వ్యతిరేకంగా