Site icon HashtagU Telugu

TS Cabinet: పోలీసు శాఖలో నూతన ఉద్యోగ నియామకాలకు క్యాబినేట్ ఆమోదం!

Kcr Telangana Job Notification

Kcr Telangana Job Notification

శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖను మరింత పటిష్టం చేయాలని క్యాబినేట్ నిర్ణయించింది. పెరుగుతున్న సాంకేతికత, మారుతున్న సామాజిక పరిస్థితులలో, నేరాల తీరు కూడా మారుతున్న నేపథ్యంలో నేరాల అదుపునకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలనీ, అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమించుకోవాలని క్యాబినేట్ నిర్ణయించింది.

నార్కోటిక్ డ్రగ్స్, గంజాయి తదితర మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్ ను దెబ్బతీస్తూ శాంతిభద్రతల సమస్యగా పరిణమిస్తున్నాయనీ, క్యాబినేట్ చర్చించింది. డ్రగ్స్ నేరాలను అరికట్టి నిర్మూలించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మరియు తెలంగాణ సైబర్ సేఫ్టీ బ్యూరో పరిధిలో 3,966 పోస్టులను వివిధ కేటగిరీలలో భర్తీ చేయాలని క్యాబినేట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోంశాఖను క్యాబినేట్ ఆదేశించింది.

వీటితోపాటు..
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో.. శాంతిభద్రతలను మరింతగా మెరుగు పరిచేందుకు, పోలీసు వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి, నూతన పోలీస్ స్టేషన్లు, నూతన సర్కిల్ లు, నూతన డివిజన్ల ఏర్పాటుకు క్యాబినేట్ ఆమోదం తెలిపింది.