BYD Car Plant : చైనా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ ‘బీవైడీ’ తొలిసారిగా మన దేశంలో ప్లాంటు ఏర్పాటు చేయబోతోంది. మరెక్కడో కాదు.. తెలంగాణలో ఆ ప్లాంటును ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ నగరం శివార్లలో ఎలక్ట్రిక్ కార్ల యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకు అనువైన మూడు ప్రదేశాలను బీవైడీకి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మూడు ప్రదేశాలను బీవైడీ కంపెనీ ప్రతినిధులు పరిశీలిస్తున్నారు. వాటిలో ఏదో ఒక ప్రదేశాన్ని కార్ల ప్లాంటు కోసం ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంతో బీవైడీ ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ ప్రాజెక్టుకు భూమిని కేటాయించడంతో పాటు అన్నిరకాల మద్దతు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే ప్లాంటులో రాబోయే ఏడేళ్లలో ఏటా 6 లక్షల ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని బీవైడీ(BYD Car Plant) భావిస్తోంది. ఇందుకోసం దశల వారీగా భారీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది.
Also Read :Shreyas Iyer: శ్రేయస్ సెంచరీ మిస్.. కారణం చెప్పిన శశాంక్!
ఇప్పటికే మేఘాతో బీవైడీ జట్టు
హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) వ్యాపార గ్రూపులోని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ కంపెనీ ఇప్పటికే నగర శివార్లలో ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేస్తోంది. ఇందులో ఎన్నో ఏళ్లుగా బీవైడీకి సాంకేతిక భాగస్వామ్యం ఉంది. బీవైడీ అందించే టెక్నాలజీతోనే విద్యుత్తు బస్సులకు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ప్లాంటులో రూపకల్పన జరుగుతోంది. ఈ కారణం వల్లే హైదరాబాద్ శివార్లలో ఎలక్ట్రిక్ కార్ల యూనిట్‌ను ఏర్పాటు చేయాలని బీవైడీ నిర్ణయించుకుందట. ఈ యూనిట్‌కు సమీపంలోనే ఎలక్ట్రిక్ కార్ల విడిభాగాల తయారీ యూనిట్ల ఏర్పాటును తెలంగాణ సర్కారు ప్రోత్సహించనుంది. తద్వారా హైదరాబాద్ శివార్లలో ఎలక్ట్రిక్ వాహనాల క్లస్టర్ రూపుదిద్దుకోనుంది.
ఇప్పటివరకు చైనా నుంచి దిగుమతి..
ప్రస్తుతం బీవైడీ ఎలక్ట్రిక్ కార్లను చైనా నుంచి భారత్‌కు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. దిగుమతి సుంకాల భారం వల్ల ఈ కార్ల ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. ఫలితంగా అమ్మకాలు అంతగా జరగడం లేదు. భారత్‌లో కార్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు గత రెండేళ్లుగా బీవైడీ కసరత్తు చేస్తోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించడంతో.. బీవైడీ ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయింది. భారత్‌లో 20 గిగావాట్ల బ్యాటరీ ప్లాంటును కూడా ఏర్పాటు చేయాలని బీవైడీ భావిస్తోంది.