Burra Venkatesham: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీజీపీఎస్సీగా బుర్రా వెంకటేశంను (Burra Venkatesham) నియమించింది. ఈ మేరకు నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం టీజీపీఎస్సీ చైర్మన్‌గా ఉన్న మహేందర్ రెడ్డి పదవీకాలం డిసెంబర్ 3తో ముగియనున్న విషయం తెలిసిందే. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. ఈ మేరకు ఫైల్‌పై గవర్నర్ సంతకం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బుర్రా వెంకటేశం 1995 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన 2023 నుంచి తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా.. డిసెంబర్ 3తో మహేందర్ రెడ్డి పదవీకాలం ముగియనుంది. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
కొత్త చైర్మన్ నియామకానికి ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 20 వరకు దరఖాస్తులు స్వీకరించింది. మొత్తం 45 అప్లికేషన్లు రాగా అందులో రిటైర్డ్ ఐఏఎస్‌లు, వివిధ వర్సిటీలకు చెందిన ప్రొఫసర్లు కూడా ఉన్నారు. వారిలో బుర్రా వెంకటేశంను ప్రభుత్వం ఎంపిక చేసింది.
బుర్రా వెంకటేశం కెరీర్
బుర్రా వెంకటేశం 1968 ఏప్రిల్ 10న తెలంగాణలోని జనగామ జిల్లా ఓబుల కేశవపురం గ్రామంలో బుర్రా నారాయణ గౌడ్, గౌరమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన రెండో తరగతిలో ఉండగానే తన ఏడేళ్ల వయస్సులోనే తండ్రి నారాయణను కోల్పోయాడు. ఏడవ తరగతి వరకు స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ఏడవ తరగతి ఉమ్మడి వరంగల్ జిల్లా మొదటి ర్యాంకు సాధించాడు. ఆయన తరువాత నల్గొండ జిల్లా సర్వేలు గురుకుల పాఠశాలలో 8వ తరగతి నుండి పదో తరగతి వరకు చదివి పదో తరగతిలో టాపర్‌గా నిలిచారు. బి. వెంకటేశం తరువాత హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ ప్రైవేటుగా చదివి టాపర్‌గా నిలిచి చదువుకుంటూనే మరోపక్క ట్యూషన్స్ చెబుతూ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ చేశాడు. కోచింగ్ లేకుండానే 1994లో సివిల్స్ కు ప్రిపేర్ అయి 1995లో మెయిన్స్ రాసి తరువాత వెలువడిన ఫలితాల్లో జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1వ ర్యాంకు సాధించి టాపర్‌గా నిలిచాడు.
బుర్రా వెంకటేశం ఐఏఎస్ శిక్షణ అనంతరం 1996లో ఆదిలాబాద్ ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన 1996లో చివర్లో తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా, 1998లో రాజమండ్రి సబ్ కలెక్టర్‌గా, 1999లో వరంగల్ మునిసిపల్ కమిషనర్‌గా, 2001లో చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా, 2003లో గుంటూరు జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెదక్, గుంటూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేశాడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌కు ప్రాజెక్టు డైరెక్టర్‌గా, ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా, స్టేట్ టూరిజం డిపార్ట్‌మెంట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వివిధ హోదాల్లో పనిచేశాడు.