Munugode TRS : మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా గౌడ్..?

మునుగోడు ఉప ఎన్నికకు కాంగ్రెస్, బీజేపీలు రెడ్డి సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని ఎంపిక చేయడంతో టీఆర్‌ఎస్ తన

  • Written By:
  • Publish Date - September 11, 2022 / 05:54 PM IST

మునుగోడు ఉప ఎన్నికకు కాంగ్రెస్, బీజేపీలు రెడ్డి సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని ఎంపిక చేయడంతో టీఆర్‌ఎస్ తన ఆప్షన్‌లను పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బీసీ సామాజిక‌వ‌ర్గానికి చెందిన మాజీ ఎంపీ డాక్టర్ బూర నరసయ్య గౌడ్‌తో పాటు సుదీర్ఘకాలంగా కె. ప్రభాకర్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు. నియోజకవర్గంలో నిర్వహించిన సమగ్ర సర్వే నివేదికల ఆధారంగా టీఆర్‌ఎస్‌ ఎంపిక ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. మెజారిటీ ఉన్న బీసీ సంఘాల నాయకులు ఆ సంఘం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతివ్వడానికి సుముఖత వ్యక్తం చేయడం డాక్టర్ బూర న‌ర్స‌య్య గౌడ్‌కు అనుకూలమైన అంశంగా ఉంది.

డాక్టర్ బూర న‌ర్స‌య్య గౌడ్, మెడికల్ ప్రాక్టీషనర్, హైదరాబాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లాపరోఎండోస్కోపిక్ సర్జరీ (HILS) డైరెక్టర్‌గా ఉన్నారు. ఆదిత్య హాస్పిటల్, కేర్ హాస్పిటల్స్‌లో ఆయ‌న సేవ‌లు అందిస్తున్నారు.
మునుగోడు బ‌రిలో నుంచి మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి కుటుంబ సభ్యుడి పేరు పరిశీలనకు వచ్చినట్లు సమాచారం. అయితే సుఖేందర్ రెడ్డి ఆచితూచి అడుగు వేస్తున్నారు. 2018లో మునుగోడులో ఓడిపోయి 2014లో గెలిచిన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కోసం మంత్రి జగదీశ్ రెడ్డి లాబీయింగ్ చేస్తున్నారు. కులాల వారీగా ఓటింగ్‌, పార్టీల వారీగా ఓటింగ్‌, అభ్యర్థి పేరుపై ఓటింగ్‌ ఆధారంగా సర్వేల సమగ్ర నివేదికలను టీఆర్‌ఎస్‌ నాయకత్వం అధ్యయనం చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వారం రోజుల్లోగా పార్టీ తన అభ్యర్థిని ప్రకటించే అవ‌కాశం ఉంది .ఆ లోపు నియోజ‌క‌వ‌ర్గంలో మారుతున్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను నిశితంగా టీఆర్ఎస్ అధిష్టానం ప‌రిశీలిస్తోంది.