RS Praveen Kumar : కవిత అరెస్టుపై ఆర్ఎస్పీ ట్వీట్.. నెటిజన్లు ఏమన్నారో తెలుసా ?

RS Praveen Kumar : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 

  • Written By:
  • Updated On - March 16, 2024 / 08:58 AM IST

RS Praveen Kumar : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.  ఈ ట్వీట్‌లో కవితకు మద్దతుగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత అరెస్టు రాజకీయ కుట్రలో భాగమన్నారు.  మోడీ ప్రభుత్వం ఈడీని అడ్డంపెట్టుకొని కల్వకుంట్ల కవిత గారిని వేధిస్తోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈవిధంగా విపక్ష నేతలను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదన్నారు. ఈ అరెస్టును తాము బీఎస్పీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు. ‘‘కేసీఆర్ గారు తెలంగాణలో బీజేపీ కుటిల ఎత్తుగడలకు తలొగ్గలేదు. విశాల తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బీజేపీతో ఎన్నికల పొత్తుకు కేసీఆర్ సమ్మతించలేదు. బీజేపీ-కాంగ్రెస్ వ్యతిరేక లౌకిక జాతీయ పార్టీ అయిన బీఎస్పీతో బీఆర్ఎస్ చేతులు కలిపిన కొన్ని గంటల్లోనే మోడీ బ్లాక్‌మెయిల్ పాలిటిక్స్‌కు తెర తీశారు’’ అని ఆరోపించారు. ‘‘ఈడీ చర్యలు ముమ్మాటికీ అప్రజాస్వామికం. ఇది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవంపై దెబ్బకొట్టడం తప్ప మరొకటి కాదు’’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) మండిపడ్డారు.

We’re now on WhatsApp. Click to Join

‘‘ఇలాంటి అక్రమ అరెస్ట్‌లతో అదిరేది బెదిరేది లేదు. బెదిరితే తెలంగాణ వచ్చేది కాదు. ఈ దుశ్చర్య కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలను నడుపుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుదుర్చుకున్న లోపాయికారీ ఒప్పందంలో భాగమే’’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఈడీతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేయించిన ఈ అక్రమ అరెస్ట్‌ను తమ ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా భావించి..  ఈ రెండు దోపీడీ దొంగల పార్టీలకు త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజలు తిరగబడి తగిన బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. ‘‘దేశంలో మోడీ పాలన నాటి నాజీల నియంతృత్వం కన్నా ఘోరంగా ఉంది. మొన్న సాయిబాబా, సిసోడియా, నిన్న హేమంత్ సోరెన్, నేడు కల్వకుంట్ల కవిత, రేపు నువ్వో నేనో..? అందుకే తెలంగాణ సమాజం, యావత్తు దేశం బీజేపీ-కాంగ్రెసులను తక్షణమే తిరస్కరించాల్సిన అవసరం ఉంది’’  అని పేర్కొంటూ ఆర్ఎస్పీ ట్వీట్ చేశారు.

Also Read :Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం ఏమిటి ? కల్వకుంట్ల కవితపై అభియోగాలు ఏమిటి ?

అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు మండిపడ్డారు. కొన్ని రోజుల్లో ఇంతలా స్టాండ్ మార్చేయడం విడ్డూరంగా ఉందని ఫైర్ అయ్యారు. ‘‘మెున్నటి వరకు కేసీఆర్‌ది అవినీతి కుటుంబం అన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు యూట్నర్ తీసుకున్నారు’’ అని కొందరు వ్యాఖ్యానించారు. కవితను అరెస్టు చేయాలంటూ గతంలో ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ట్వీట్లను కొందరు నెటిజన్లు రీట్వీట్ చేశారు. ‘‘అయ్యా ప్రవీణ్ సార్.. కేసీఆర్‌ హయాంలో మీరు స్కామ్‌లను రోజూ బయటపెట్టేవారు. ఇప్పుడు మీరే హఠాత్తుగా నేరేషన్‌ మార్చారు. మీరు ఎవరిని మోసం చేస్తున్నారు సార్ ? ప్రజలు మూర్ఖులు కాదు’’ అని ఇంకొందరు నెటిజన్స్ హితవు పలికారు. ‘‘గిదేంది సారూ గింతమాటంటిరి.. మొన్నటి వరకు బీఆర్ఎస్‌ను కడిగి పారేశారు కదా. ఇప్పుడు ఇలా ప్లేటు ఫిరాయించటం ఏమిటి ?’’ అని మరో నెటిజన్ ప్రశ్నించారు.