Site icon HashtagU Telugu

RS Praveen kumar: మునుగోడు బరిలో ‘బీఎస్పీ’

Rs Praveen

Rs Praveen

కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహరంతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.  తన అన్న, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సరైన సమయంలో ఆయన కూడా సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. అయితే రాజగోపాల్ రాజీనామాతో అన్ని పార్టీలు మునుగోడుపై గురి పెడుతున్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ నిర్వహించి తాము మునుగోడును గెలుచుకుంటామని స్పష్టం చేశారు. ఇక ఈనెల 21 బీజేపీ బహిరంగ సభ నిర్వహించాలని తలపెడితే, టీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది.

తెలంగాణ లోని ఇతర పార్టీలు కూడా మునుగోడుపై ఫోకస్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం మునుగోడు ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఆయన పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల కారణంగా బీఎస్పీ కూడా పోటీ చేయాలని భావిస్తున్నట్టు కార్యకర్తలు, నాయకులతో చర్చించినట్టు సమాచారం. ఇప్పటికే పాదయాత్రలు చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కూడా మునుగోడు లో భారీ బహిరంగ సభ పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే బీఎస్పీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ బరిలో దిగుతారా? ఇతర నేతలను ఖరారు చేస్తారా? అనేది తేలాల్సి ఉంది.