Site icon HashtagU Telugu

Medak : కాంగ్రెస్ యువ నాయకుని దారుణ హత్య

Marelli Anil

Marelli Anil

మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంటంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి చెందిన యువ నాయకుడు మారెల్లి అనిల్(Anil) ను అతి దారుణంగా హత్య చేయడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సోమవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎస్సీ సెల్ జిల్లా నాయకునిగా సేవలు అందిస్తున్న అనిల్ గాంధీ భవన్ లో పార్టీ కార్యక్రమం ముగించుకుని తిరిగి వస్తుండగా, మల్లేశం అనే మండల అధ్యక్షుడిని మధ్యలో దించి ఒంటరిగా ప్రయాణిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వెంబడించి ఆయనపై కాల్పులు జరిపారు.

ఘటన అనంతరం స్థానికులు మొదట దాన్ని రోడ్డు ప్రమాదం అని భావించి అనిల్‌ను మెదక్‌లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అనిల్ శరీరంపై బుల్లెట్ గాయాలు గుర్తించిన వైద్యుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించగా, అక్కడ నాలుగు బుల్లెట్లు లభ్యమయ్యాయి. ఈ ఆధారాలతో ఇది ప్రమాదం కాదని స్పష్టమవడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

Marathon Runner : ఫౌజా సింగ్‌ మృతి

హత్యకు కారణాలు భూ తగాదాలేనని భావిస్తున్నారు. అనిల్ ఇటీవల హైదరాబాద్‌లోని ఓ భూమి వివాదాన్ని సెటిల్ చేయడంలో పాలుపంచుకున్నాడని తెలుస్తోంది. అందులో భాగంగానే కొంత మంది వ్యక్తులు కక్ష పెంచుకుని, పక్కా పథకం ప్రకారం హత్యకి పాల్పడ్డారని అనిల్ సన్నిహితులు, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనిల్ సమీపానికి వచ్చిన సమయంలో ఆయన్ని ఒంటరిగా చూసి, నిర్మానుష్య ప్రాంతంలోనే కాల్పులు జరిపారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటన వార్త కొల్చారం మండలంలో ఒక్కసారిగా తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనిల్ ఇలాంటి మృత్యువు పాలయ్యాడన్న వార్త పార్టీ శ్రేణులు, గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. అనిల్ మృతిపట్ల పలువురు రాజకీయ నాయకులు, స్థానిక పెద్దలు తమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కేసు విచారణ వేగంగా జరిపి నిందితులను త్వరగా పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.