KCR : మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేపట్టిన పాదయాత్ర గోదావరిఖని నుంచి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా పాదయాత్ర బృందంతో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంపన్నంగా ఉన్న తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధపడుతున్నారని అన్నారు. పదేళ్లు పచ్చగా ఉన్న తెలంగాణ ఇప్పుడు సమస్యల వలయంల చిక్కుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో అధికారం మళ్లీ బీఆర్‌ఎస్‌దే అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు.
Read Also: Anantapur : నీటి భద్రతను సాధ్యం చేస్తోన్న అల్ట్రాటెక్ సిమెంట్
తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్‌ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు. అందరూ ఒక్కో కేసీఆర్‌ల తయారు కావాలన్నారు. కాంగ్రెస్ నోటికొచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి లేకుంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చే వాళ్లు కాదని తెలిపారు. బెల్లం దగ్గరకు వచ్చిన ఈగలు మాదిరి తెలంగాణలో సంపద దోచుకునేందుకు కొందరు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పదేళ్లు తెలంగాణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బీఆర్‌ఎస్ అడ్డుగా ఉందని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు.
రామగుండంలో పరిస్థితులుపై మాట్లాడిన కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యేలపై విమర్శలు చేశారు. అక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఓ సన్నాసి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయిన వెంటనే సమస్యలు చుట్టు ముట్టాయని తెలిపారు. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోయిందని విమర్శించారు. చాలా విషయాల్లో కేంద్రం నుంచి ఒత్తిడి వచ్చినా తాను వెనకడుగు వేయలేదన్నారు. భవిష్యత్‌లో చాలా పోరాటాలు చేయాలని సూచించారు. తెలంగాణ హక్కుల కోసం నిలబడాలని పేర్కొన్నారు. ఎవరూ శాశ్వతంగా ఉండిపోరని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకనాడు తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపారని తర్వాత ఇందిరాగాంధీ మోసం చేశారని కేసీఆర్ ఆరోపించారు.