తెలంగాణ రాజకీయ వర్గాల్లో బిఆర్ఎస్-బీజేపీ విలీన (BRS Will Merge with BJP) వార్తలు కలకలం రేపుతున్నాయి. తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ (CM Ramesh)చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. విలీనంపై చర్చించేందుకు కేటీఆర్ (KTR) తన ఇంటికి వచ్చారని ఆయన ఆరోపించారు. ఢిల్లీలోని తన నివాసానికి కేటీఆర్ కవితతో కలిసి వచ్చి, తమపై ఉన్న కేసుల్ని ఆపితే బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తామని కోరినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని సీసీ టీవీ ఫుటేజీతో నిరూపించేందుకు సిద్ధమని అన్నారు.
కేటీఆర్ తనపై చేసిన ఆరోపణలపై కూడా సీఎం రమేష్ స్పందించారు. ఫ్యూచర్ సిటీలో తనకు రోడ్ కాంట్రాక్ట్ వచ్చిందన్న ఆరోపణను ఖండించారు. తన కుటుంబానికి చెందిన రుత్విక్ కంపెనీ నిబంధనల ప్రకారం టెండర్ గెలుచుకుందన్నారు. రుత్విక్ కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్ట్‌ను రేవంత్ రెడ్డి ఇచ్చిన బహుమతిగా కేటీఆర్ అభివర్ణించినందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఆంధ్రా కాంట్రాక్టర్లు దోచేస్తున్నారని విమర్శించడం సరికాదన్నారు. ఒకే కంపెనీ టెండర్ గెలవడమే కాకుండా, దాన్ని రాజకీయం చేయడం తగదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఎవరికెవరికీ ఎన్ని కాంట్రాక్టులు ఇచ్చారో లెక్కలు వేయాలని సవాల్ విసిరారు.
రాజకీయ అవసరాల కోసం తనపై బురదచల్లడం తగదని, కేటీఆర్ చేసిన ప్రతి పని బయటపెడతానని హెచ్చరించారు. అమెరికా, మాల్దీవులకు కేటీఆర్ ప్రయాణాల వివరాలు తన దగ్గర ఉన్నాయని.. అవన్నీ ఈడీ, సీబీఐకు ఇవ్వనున్నట్లు తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఏం చేశారో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్, కేటీఆర్ అధికారం వచ్చిన తర్వాత తమను మర్చిపోయారని, కానీ తాము రాజకీయాలను స్నేహంతో కలపబోమని అన్నారు. ఇక గచ్చిబౌలి భూముల తాకట్టు వ్యవహారంలో బీజేపీ ఎంపీ పాత్ర ఉందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. మరి రమేష్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.