ఖమ్మం జిల్లాలో 2018 వరకు టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గం అది.. 2018 ఎన్నికల్లో టీడీపీ నుంచి భారీ మెజార్టీతో సండ్ర వెంకటవీరయ్య గెలిచారు. అయితే కొన్ని నెలలు తిరగకుండానే ఆయన అప్పటి టీఆర్ఎస్.. ఇప్పడు బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఆయనతో పాటు అతికొద్ది మంది నాయకులు మాత్రమే టీడీపీ నుంచి బీఆర్ఎస్‌లో చేరారు. అయితే ఇక్కడ టీడీపీ క్యాడర్ మాత్రం సండ్ర వెంకటవీరయ్యతో వెళ్లలేదు. గ్రౌండ్ లెవల్‌లో టీడీపీ ఈ నియోజకవర్గంలో బలంగా ఉంది. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడంతో మొట్టమొదటిసారి ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి అభ్యర్థి లేరు. అయితే ఇప్పుడు టీడీపీ ఓటింగ్ అంతా ఎవరి వైపు వెళ్తుంది అన్న ప్రశ్న అందరిలో నెలకొంది. బీఆర్ఎస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు టీడీపీలో యువత,నాయకులు అంతా వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన కోసం ఎన్నికల్లో పని చేసిన వారిపై అధికార పార్టీలోకి వెళ్లాక కేసులు పెట్టించారంటూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో టీడీపీ ఓటింగ్ బీఆర్ఎస్ వైపు వచ్చే అవకాశం లేదు.
We’re now on WhatsApp. Click to Join.
ఇటు కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రముఖ వైద్యురాలు డాక్టర్ మట్టా రాగమయి బరిలో ఉన్నారు. తొలుత మట్టా దయానంద్ విజయ్‌కుమార్ బరిలో ఉన్నప్పటికి మహిళా కోటాలో ఆయన సతీమణికి టికెట్ దక్కింది. సత్తుపల్లి కాంగ్రెస్ టికెట్ కోసం చాలా మంది బరిలో నిలిచినప్పటికి మట్టా రాగమయి వైపే అధిష్టానం మొగ్గు చూపింది. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసిన దయానంద్ విజయ్‌కుమార్ ..అప్పటి టీడీపీ అభ్యర్థిగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యపై 2400 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు.2018 ఎన్నికల్లో బీఆర్ఎస్‌లో మట్టా దయానంద్ చేరినప్పటికి ఆయనకు టికెట్ రాలేదు. వైసీపీలో ఉన్నప్పటి నుంచి ఆయన పొంగులేటి వర్గంగా ఉన్నారు. అయితే ఇటీవల పొంగులేటికి, మట్టాకు కాస్త గ్యాప్ పెరిగింది. అందుకోసమే టికెట్ ప్రకటనలో జాప్యం జరిగిందని కాంగ్రెస్ క్యాడర్‌లో గుసగుసలు వినిపిస్తుంది. అయినప్పటికి ఎట్టేకేలకు మట్టా దయానంద్ టికెట్ దక్కించుకున్నారు.
Also Read: Maoist Party : బిఆర్ఎస్ పార్టీని తన్ని తరిమేయాలని మావోయిస్టు పార్టీ పిలుపు
గత ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా ఇక్కడ కాంగ్రెస్ పోటీ చేయలేదు. పొత్తులో ఈ సీటుని టీడీపీకి కేటాయించడంతో రెండు పార్టీల ఓట్లు మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసిన సండ్ర వెంకటవీరయ్యకు పడ్డాయి. బీఆర్ఎస్ నుంచి పిడమర్తి రవికి 80వేల ఓట్లు పోల్అయ్యాయి. కాంగ్రెస్ పోటీ చేయకపోవడంతో టీడీపీ నుంచి సండ్ర వెంకటవీరయ్య భారీ మెజార్టీతో గెలిచారు.అయితే ఇప్పుడు 2014 ఎన్నికలే రిపీట్ అయ్యేలా పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరి మధ్య హోరాహోరి పోరు జరగనుంది. కాంగ్రెస్‌కు ఈ సారి టీడీపీ ఓటు బ్యాంక్ కలిసి వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి మట్టా రాగమయి దయానంద్ పక్కా లోకల్ అంటూ ప్రచారం లో దూసుకుపోతుండగా.. నాలుగోసారి నేనే గెలుస్తానంటూ బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య సవాల్ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఆరుసార్లు టీడీపీ గెలిచింది. గత రెండు పర్యాయాలు ఇక్కడ బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోతుంది. మరి ఈ సారి సత్తుపల్లిలో ఏ జెండా ఎగురుతుందో డిసెంబర్ 3తేదీ వరకు వేచి చూడాల్సిందే.