బీఆర్ఎస్ (BRS) పార్టీ అంటే కేసీఆర్‌దో, కేటీఆర్‌దో కాదు.. ఇది తెలంగాణ ప్రజల గొంతుక అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని గురువారం బీఆర్ఎస్‌వీ రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి అన్ని నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్‌వీ నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్..కాంగ్రెస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు.
తెలంగాణ రాష్ట్రం కోసమే బిఆర్ఎస్ ఆవిర్భవించిందని, పోరాటం బీఆర్ఎస్ పార్టీకి కొత్తేం కాదని, వైస్ రాజా శేఖర్ రెడ్డి, చంద్రబాబు లాంటి వాళ్ళతోనే కొట్లాడినోళ్ళం, రేవంత్ రెడ్డి ఎంత అని హెచ్చరించారు. నదులు ఎక్కడ ఉన్నాయో, విప్రో ఛైర్మెన్ ఎవరో తెలియని వ్యక్తి రేవంత్ రెడ్డి, మనకి ముఖ్య మంత్రి కావడం దౌర్భాగ్యమన్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష.. కేసీఆర్ నాయకత్వం, గులాబీ జెండానే తెలంగాణకు రక్షణ. ఈ పార్టీ మరో 75 ఏండ్ల పాటు ఒక డీఎంకే లాగా, శిరోమణి అకాలీదళ్ లాగా ఉంటది. ఈ పార్టీ మన తెలంగాణ ప్రజలది అని కేటీఆర్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో మనం జాగ్రత్తగా ఉండాలి. కాంగ్రెస్‌నే శత్రువుగా చూడాల్సిన అవసరం లేదు. తెలంగాణ సమాజానికి మరింత డేంజరస్ పార్టీ బీజేపీనే. మతాలను అడ్డంపెట్టుకుని, మతపరమైన రాజకీయాలు చేస్తూ.. దేవుడిని అడ్డుపెంట్టుకుని పిల్లలను రెచ్చగొడుతున్నారు.. తెలంగాణకు బిజెపి చేసిందేమీ లేదన్నారు. 32 జిల్లాల్లో పార్టీ ఆఫీసులు ఉన్నాయి. ప్రతి జిల్లాలో బీఆర్ఎస్వీ సమావేశాలు జరగాలి. మండలం, నియోజకవర్గం స్థాయిలో కమిటీలు వేసుకుందాం. సమర్థవంతమైన విద్యార్థి నాయకులు ఉన్నారు. వారిని జిల్లాలకు పంపుదాం. మండల కమిటీ, కాలేజీ కమిటీలను భర్తీ చేసి కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసుకుందాం. ఎక్కడికక్కడ సోషల్ మీడియాలో క్రియాశీలక పాత్ర పోషించాలి. కేసులకు భయపడొద్దు అని భరోసా ఇచ్చారు.
నీళ్లు, నిధులు, నియామకాలు కోసం పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామని, ఇవాళ రాష్ట్రంలో ఏ వర్గం వారికి కష్టం వచ్చినా తెలంగాణ భవన్ అక్కున చేర్చుకుంటుందని స్పష్టం చేశారు. జీవో 29 వల్ల గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని, వారి కోసం అశోక్ నగర్ పోదామని అనుకుంటే అక్కడ ఎక్కడ చూసినా పోలీసులను దింపారని మండిపడ్డారు. గ్రూప్ 1 అభ్యర్థులే తెలంగాణ భవన్‌కు వచ్చారని, వారికి అండగా బీఆర్ఎస్ ఉంటుందని చెప్పారు.
Read Also : Press Meet : రాష్ట్రంలో ప్రతీ నిరుద్యోగికీ ఉద్యోగం..అందరికీ ఉపాధి..మా ప్రభుత్వ ఆలోచన: సీఎం రేవంత్ రెడ్డి