No Confidence Motion: ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్ మద్దతు

ఎన్డీయే ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేత గౌరవ్‌ గొగోయ్‌ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి బుధవారం లోక్‌సభలో భారత్‌ రాష్ట్ర సమితి మద్దతు తెలిపింది.

No Confidence Motion: ఎన్డీయే ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేత గౌరవ్‌ గొగోయ్‌ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి బుధవారం లోక్‌సభలో భారత్‌ రాష్ట్ర సమితి మద్దతు తెలిపింది. ఈ తీర్మానంపై బుధవారం ఖమ్మం బీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడారు. తెలంగాణపై కేంద్రం అనుసరిస్తున్న వివక్ష, మణిపూర్‌లో జాతి హింస మొదలుకుని వివిధ అంశాలపై బీజేపీ నేతృత్వంలోని కేంద్రాన్ని నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా హామీలు ఇచ్చినా కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు రావడం లేదన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో అనేక హామీలు ఇచ్చారని, తెలంగాణకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కేంద్రం నెరవేర్చలేదన్నారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే తన నియోజకవర్గానికి ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయాలు వచ్చాయని చెప్పారు. మరి తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదు? తెలంగాణ భారతదేశంలోనే కదా? నవోదయ విద్యాలయాలు ఇవ్వలేదు. ఇప్పటికే మంజూరు చేసిన ఐటీఐఆర్ ప్రాజెక్టును కేంద్రం రద్దు చేసింది అని ఫైర్ అయ్యారు.

మిషన్‌ భగీరథపై నామా మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ నీటిని అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతమైందని, ప్రత్యేక తెలంగాణ ప్రకటనకు ముందు ఆ పరిస్థితి లేదని అన్నారు. నీతి ఆయోగ్ సిఫారసు చేసినా మిషన్ భగీరథకు నిధులు అందించడంలో కేంద్రం విఫలమైందని అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. అమెరికాలో కరెంటు కోత ఉండొచ్చు కానీ తెలంగాణలో ఒక్క నిమిషం కూడా కరెంటు ఉండదు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రం అంధకారంలో ఉంది. పంట దిగుబడిలో పంజాబ్‌ను అధిగమించి రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నాం. ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌-1గా ఉందన్నారు.

మణిపూర్ అల్లర్లపై నామా ధ్వజమెత్తారు. కాశ్మీర్‌లో హింస చెలరేగినప్పుడు, మేము సుష్మా స్వరాజ్‌తో కలిసి మొత్తం ప్రతిపక్షాన్ని కాశ్మీర్‌కు తీసుకెళ్లాలని డిమాండ్ చేశాము. అదే విధంగా మణిపూర్‌కు కేంద్రం అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్లాలి అని అన్నారు.

Also Read: Kerala State : కేరళ పేరు మారింది.. ఇకపై అది ‘కేరళం’