Medical Colleges: మెడికల్ కాలేజీలపై కిరికిరీ.. బీజేపీకి బీఆర్ఎస్ స్ట్రాంగ్ కౌంటర్!

తెలంగాణలో మెడికల్ కాలేజీ ఏర్పాటుపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

  • Written By:
  • Updated On - June 9, 2023 / 03:38 PM IST

మెడికల్ కాలేజీలకు సంబంధించి జాతీయ వైద్య కమిషన్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా కొత్తగా 50 మెడికల్ ఏర్పాటునకు ఆమోదం తెలిపింది.  ఈ నేపథ్యంలో తెలంగాణలో 12 కొత్త కాలేజీలకు ఆమోదముద్ర వేసింది. అయితే మెడికల్ కాలేజీ ఏర్పాటుపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణకు 12 మెడికల్ కాలేజీలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని బీజేపీ నేతలు చెబుతుండగా, కాదు కాదు.. కేంద్రం కేవలం పర్మిషన్ ఇచ్చిందని, అందుకు అయ్యే ఖర్చు మాదేనని బీఆర్ఎస్ ప్రభుత్వం వాదిస్తోంది. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు 13 మెడికల్ కాలేజీలను మంజూరుచేసిందని రియాక్ట్ అవ్వగా, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాత్రం 12 మంజూరు చేసిందని ట్వీట్ చేయడం కూడా విమర్శలకు దారితీసింది.

కేంద్రం తప్పుడు ప్రచారం : తెలంగాణ ఫ్యాక్ట్ చెక్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన స్వంత నిధులతో ఏర్పాటు చేస్తున్న మెడికల్‌ కాలేజీలను కేంద్ర ప్రభుత్వ ఖాతాలో వేస్తూ తప్పుడు ప్రచారం జరుగుతుందని తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ ఓ ట్వీట్ లో తెలియజేసింది. ‘‘వాస్తవం ఏంటంటే, ఈ ఏడాది నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (NMC) దేశవ్యాప్తంగా 50 మెడికల్‌ కాలేజీలకు అనుమతులు మంజూరు చేసింది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్‌, ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నడిచే కాలేజీలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొమ్మిది మెడికల్‌ కాలేజీలతో పాటు మరో నాలుగు ప్రైవేట్‌ కాలేజీలకు NMC అనుమతులు ఇచ్చింది’’. అని తేల్చి చెప్పింది

‘‘ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడానికి అనుమతి కోసం దరఖాస్తు చేసినపుడు, ఆ సంస్థలు అన్ని రూల్స్ & రెగ్యులేషన్స్ పాటిస్తున్నారు అని ధృవీకరించుకొని అనుమతులు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నNMC బాధ్యత. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న 9 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు. కేవలం అనుమతులు మంజూరు చేయడాన్ని, కేంద్ర ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినట్టు అర్థం వచ్చేలా కొందరు ప్రజా ప్రతినిధులు సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’’ అని విజ్ఞప్తి చేసింది.

కాలేజీల ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చింది: బండి సంజయ్

రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇవ్వడం హర్షణీయమని బండి సంజయ్ అన్నారు. ‘‘నేను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం సంతోషంగా ఉంది. గారికి ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శం. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం విషయంలో కేంద్రం ప్రత్యేక నిధులిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా తెలంగాణ ప్రజలపట్ల మోదీ గారికి ఉన్న అభిమానంతో తెలంగాణ అభివృద్దిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.

మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో కేంద్రం సహకరించలేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం పచ్చి అబద్దం. కేంద్ర నిధులతో తెలంగాణలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నామని, ఈ మేరకు దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ నాటి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్దన్ గారు స్వయంగా లేఖ రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఈ విషయంలో సైంధవుడులా అడ్డుకున్న కేసీఆర్ తిరిగి కేంద్రం సహకరించలేదనడం సిగ్గు చేటు’’ బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యాడు.

Also Read: Fish Medicine: చేప ప్రసాదం పంపిణీ షురూ.. భారీగా తరలివచ్చిన జనం!