BRS Protest: గ్యాస్ ధరల పంపుపై భగ్గుమన్న బీఆర్ఎస్!

ప్రధాని మోడీ మిత్రుడు అదానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకే ఈ ధరల పెంపు అని తెలంగాణ మంత్రులు అన్నారు.

  • Written By:
  • Updated On - March 2, 2023 / 03:41 PM IST

గ్యాస్ (Gas) ధరల పెంపును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. భారతదేశానికి మోడీ (PM Modi) ప్రధాని కావడం మన దురదృష్టకరమని, మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తి కావడంతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మరోసారి పేద మధ్య తరగతి ప్రజలపై ఊహించని భారాన్ని మోపిందనీ..ప్రధాని మోడీ మిత్రుడు అదానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకే ఈ ధరల పెంపు అని తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) రాష్టవ్యాప్తంగా నిరసనలకు పిలుపునివ్వడంతో తెలంగాణ అంతటా నిరసన సెగలు ఎగిసిపడ్డాయి.

ఇదిలావుండ‌గా, బిఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కెటిఆర్ ఇచ్చిన పిలుపు మేర‌కు, టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి, ఇచ్చిన పిలుపు మేర‌కు… కేంద్రం పెంచిన నిత్యావ‌స‌ర స‌రుకులు, ప్ర‌త్యేకించి గ్యాస్ ధ‌ర (Gas) పెంపున‌కు నిర‌స‌న‌గా 2వ తేదీన నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో, 3వ తేదీన అన్ని మండ‌ల కేంద్రాల్లో బిఆర్ఎస్ శ్రేణులు, ప్ర‌జ‌లు, మ‌హిళ‌ల‌తో క‌లిసి ధ‌ర్నాలు, ఆందోళ‌న‌లు నిర్వ‌హించాల‌ని పిలుపునివ్వడంతో ఈ కార్యక్రమం రాష్టవ్యాప్తంగా కొనసాగుతోంది.

రక్తపు ముద్దను మోడీ గుజరాత్ కు దోచిపెడుతున్నారు

కరీంనగర్ లో మంత్రి గంగుల (Gangula) మాట్లాడుతూ…75 సంవత్సరాల స్వతంత్ర పాలనలో… సిలిండర్ పై సంవత్సరానికి 100 రూపాయలు పెంచిన ఘనత కేవలం ప్రధాని మోడీకే దక్కుతుందను, బిజెపి అధికారంలోకి రాకముందు… 8 సంవత్సరాల క్రితం కేవలం 400 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు 1200 రూపాయలకు చేరుకుందనీ అన్నారు. స్వాతంత్ర్య భారత దేశ చరిత్రలో ఇంతగా ధరలు పెంచిన ప్రధాని ఎవరు లేరనీ, గడిచిన 8 సంవత్సరాలలో సిలిండర్ పై 800 రూపాయలు పెంచిన మహానుభావుడు ప్రధాని మోడీ అని అన్నారు. ధరల పెంపు పైన దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం… పేద మధ్యతరగతి ప్రజల బాధలను పట్టించుకోవడం లేదనీ,పెరిగిన ధరలను తగ్గించేందుకు చర్యలు కూడా తీసుకోవడం లేదనీ అన్నారు.

అదానికి దోచి పెట్టేందుకు పేద మధ్యతరగతి ప్రజలపై భారాన్ని మోపారనీ, మన రక్తపు ముద్దను మోడీ గుజరాత్ కు దోచిపెడుతున్నారనీ అన్నారు. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్లు… కళ్యాణ లక్ష్మి… కెసిఆర్ కిట్… వ్యవసాయానికి ఉచిత కరెంటులతో… తెలంగాణలో ఆకలికేకలు లేకుండా సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే… ప్రధాని మోడీ పెట్రోల్… గ్యాస్… పప్పులు… నిత్యావసర ధరలు పెంచి… దేశ ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారనీ దుయ్యబట్టారు. గ్యాస్ సిలిండర్ ధరను 1200 నుంచి 8 వందలకు తగ్గించాలనీ, అప్పటి వరకు ఉద్యమాన్ని ఆపబోమనీ హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు జివి రామకృష్ణారావు… మేయర్ సునీల్ రావు… డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపా రాణీ- హరి శంకర్, జెడ్పి చైర్ పర్సన్ కనుమల్ల విజయ..మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు…
బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరి శంకర్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, నగర కార్పొరేటర్లు..కౌన్సిలర్లు, బీఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

మ‌హిళ‌ల‌పై గుదిబండ‌ను మోపింది

గ్యాస్ బండ ధ‌ర‌ను (Gas) మ‌రోసారి పెంచిన కేంద్ర ప్ర‌భుత్వం సామాన్యుల‌పై ప్ర‌త్యేకించి మ‌హిళ‌ల‌పై గుదిబండ‌ను మోపింద‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. ఇప్ప‌టికే గ్యాస్ ధ‌ర పెరిగింద‌ని ఆందోళ‌న చెందుతున్న ప్ర‌జ‌ల‌పై మ‌రోసారి 50 రూపాయ‌లు పెంచడం ప‌ట్ల ఆయ‌న తీవ్ర ఆగ్ర‌హం, ఆవేద‌న‌ వ్య‌క్తం చేశారు. కేంద్రంలోకి బిజెపి ప్ర‌భుత్వం వ‌చ్చాక నిత్యావ‌స‌ర ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగాయ‌న్నారు. పెట్రో, డీజిల్ ధ‌ర‌లేగాక గ్యాస్ ధ‌ర‌లు కూడా పెరిగాయ‌న్నారు. నిత్యావ‌స‌రంగా మారి, ప్ర‌తి ఒక్క‌రూ ఆధార‌ప‌డుతున్న గ్యాస్ ధ‌ర‌ల‌ను పెంచ‌డం అంత మంచిది కాద‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వం అన్నీ పెంచి, ఒక‌రిద్ద‌రిని పోషిస్తున్న‌ట్లుగా మంత్రి ఆరోపించారు.

Also Read:Boga Sravani: కమలం ఆకర్ష్.. బీజేపీలో చేరిన బోగ శ్రావణి!