BRS: తెలంగాణను గత పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ (BRS) పార్టీకి కొత్త అధ్యక్షుడు రానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించడం గమనార్హం. అయితే కొత్త సంవత్సరంలో బీఆర్ఎస్ కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నిక జరగనున్నట్లు స్పష్టం చేశారు. అయితే పార్టీ బలోపేతం కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్‌నే మరోసారి అధ్యక్షుడిగా ఎన్నుకుంటారా? లేకపోతే కొత్త నాయకుడికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారా అనేది తెలియాల్సి ఉంది.
తాజాగా కేటీఆర్ మాట్లాడుతూ.. 2025లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుంది. 2025 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేస్తాం. పార్టీ శిక్షణ కార్యకలాపాలను, సభ్యత్వ నమోదు కార్యకలాపాలు చేపడతాం.ఇదే సమయంలో పార్టీ అధ్యక్ష ఎన్నిక కూడా ఉంటుంది. గ్రామంలోని బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అన్ని రకాలుగా పార్టీని బలోపేతం చేస్తూ.. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం అని ఆయన తెలిపారు.
Also Read: Hero Yash: అలా చేయకండి అంటూ.. కీలక ప్రకటన చేసిన ‘రాఖీభాయ్’
అయితే పార్టీ బలోపేతానికి ఈ మార్పు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధ్యక్షుడి పేరును కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కానున్నట్లు తెలుస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా హరీశ్ రావు లేదా ఎమ్మెల్సీ కవితకు ఇచ్చే అవకాశం ఉంది. అయితే బీసీలకు అధ్యక్ష పదవి ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ సైతం ఇదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అనారోగ్య సమస్యల కారణంగా కేసీఆర్ రెస్ట్ తీసుకుంటున్నట్లు కేటీఆర్ ఇటీవల తెలిపారు.
స్థానిక ఎన్నికలే లక్ష్యం
బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎన్నికలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి కేడర్ బలంగా ఉందని సంకేతాలు కాంగ్రెస్ కు ఇవ్వాలని చూస్తోంది. ఇప్పటికే గ్రామస్థాయిలో బీఆర్ఎస్ బలోపేతానికి స్థానిక నాయకులతో కేటీఆర్ చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి కేసీఆర్ కూడా తిరిగి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వస్తారని బీఆర్ఎస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.