Site icon HashtagU Telugu

KTR : అక్టోబర్‌లో బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడి ఎన్నిక : కేటీఆర్‌

BRS president to be elected in October : KTR

BRS president to be elected in October : KTR

KTR : బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఈరోజు హైదరాబాద్‌లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ రజతోత్సవ కార్యక్రమాలు, ఈనెల 27న వరంగల్ లో జరిగే సభపై దిశానిర్దేశం చేశారు. ఆ సభ తర్వాత కొత్తగా పార్టీ సభ్యత్వాలు తీసుకుంటామని, ఇకపై డిజిటల్ సభ్యత్వాలు తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. పార్టీ అధ్యక్షుడి ఎన్నిక అక్టోబర్‌లో ఉంటుందని కేటీఆర్‌ తెలిపారు. అన్ని విషయాలపై అవగాహనతో మాట్లాడగలిగేలా కార్యకర్తలకు త్వరలో శిక్షణ ఇస్తామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.

Read Also: Smita Sabharwal: గచ్చిబౌలి భూముల వివాదం..నోటీసులపై పోలీసులకు స్మితా సబర్వాల్ కౌంటర్‌

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి వచ్చే ఎన్నికలకు సిద్ధం చేయాలని కేటీఆర్ నేతలకు తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలే బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ సాధించిన విజయాలు అసమాన్యమైనవని, అనితర సాధ్యమైనవని కొనియాడారు. రెక్కాడితే గాని డొక్కాడని పేదల కడుపు కాంగ్రెస్‌ కొట్టిందని అన్నారు. ఆరు గ్యారంటీల అమలుకు డబ్బులు లేవని అంటున్న సీఎం రేవంత్‌ రెడ్డి.. లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ అంటున్నారని మండిపడ్డారు.

హైడ్రా పేరుతో సీఎం రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలో అరాచకం సృష్టించారని కేటీఆర్‌ అన్నారు. తన అన్న ఇంటిని కూల్చలేదు, ధనవంతుల ఇళ్లను ముట్టుకోలేదని తెలిపారు. గరీబోళ్ల ఇండ్లను కోర్టు సెలవులు చూసుకుని హైడ్రా ప్రతాపం చూపించిందని విమర్శించారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా హైడ్రా తన పనితీరు మార్చుకోలేదని అన్నారు. మూసీతో మురిసే రైతులు ఎందరు? వచ్చే ఉద్యోగాలు ఎన్ని? అని అంటే రేవంత్‌ రెడ్డి దగ్గర సమాధానం లేదని అన్నారు. బీఆర్ఎస్‌ హయాంలో ఎస్టీపీలను కట్టి మూసీలోకి వ్యర్థాలు పోకుండా చేశామని గుర్తు చేశారు. మూసీ కోసం ఇండ్లను కోల్పోయినవారు బూతులు తిడితే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేషన్ ఛైర్మన్లు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Read Also :  Hydraa : హైడ్రా చర్యలపై వసంత తీవ్ర అసంతృప్తి