KCR Comments: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR Comments) చాలా రోజుల తర్వాత పార్టీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రజలకు పూర్తి పరిస్థితి అర్థమైందని, వచ్చే ఎన్నికల్లో విజయం బీఆర్ఎస్ పార్టీదేనని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో పలు కీలక విషయాలు మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుత నెలకొన్న పరిస్థితులు, బీఆర్ఎస్ నాయకులపై జరుగుతున్న అక్రమ కేసులపై ఆయన స్పందించారు. అలాగే తమ ప్రభుత్వ హయాంలో ఏం చేశారో కూడా వివరిస్తూ అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు.
తమ ప్రభుత్వ హయాంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల కంటే 90% ఎక్కువే చేశామని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ప్రభుత్వంలో ఉన్నవారు ఎలా మాట్లాడుతున్నారో అందరూ చూస్తున్నారని చెప్పారు. ‘కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది తిట్టడానికి కాదు. మాకు మాటలు రావనుకున్నారా? ఇవాళ మాట్లాడటం మొదలుపెడితే రేపటి వరకు మాట్లాడతా. ప్రభుత్వం అంటే అందరినీ కాపాడాలి, కూలగొడతామంటూ భయపెడతారా? అధికారం ఇచ్చింది కూల్చడానికి కాదు.. నిర్మించడానికి’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read: Srisailam Tourism : తిరుమలతో సమానంగా శ్రీశైలాన్ని అభివృద్ధి చేస్తాం: సీఎం చంద్రబాబు
వందశాతం మనమే గెలుస్తాం: కేసీఆర్
వచ్చే ఎన్నికల్లో వందశాతం బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చి 11 నెలలు అయిపోయింది. ప్రజలు ఏం కోల్పోయారో వాళ్లకు అర్థమైంది. ప్రజలు మనపై విశ్వాసంతో ఉన్నారు. అందరూ కష్టపడి పనిచేయాలి. అరెస్టులకు భయపడేది లేదు అని కేసీఆర్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా కేసీఆర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 100 సీట్లు గెలుస్తాం: హరీశ్ రావు
తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 100 సీట్లు గెలుస్తామని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో రైతులు, విద్యార్థులు, పోలీసులు.. ఇలా అన్ని వర్గాల వారు రోడ్డు ఎక్కుతున్నారని ఆయన విమర్శించారు. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. మంత్రులు గాలి మోటార్లు ఎక్కి గాల్లో తిరుగుతున్నారని, భూమిపై తిరిగితే ప్రజలు కష్టాలు తెలుస్తాయని ఆయన సంగారెడ్డి రైతు దీక్షలో అన్నారు.