BRS Vs Congress : కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు బీఆర్ఎస్ థ్యాంక్స్.. ఎందుకో తెలుసా ?

తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మార్చే దిశగా  కాంగ్రెస్ సర్కారు ముమ్మర కసరత్తు చేస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Brs Vs Congress

Brs Vs Congress

BRS Vs Congress : తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మార్చే దిశగా  కాంగ్రెస్ సర్కారు ముమ్మర కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర అధికారిక చిహ్నంలో ఉన్న కాకతీయ తోరణం, చార్మినార్‌లను రాచరికపు గుర్తులుగా తెలంగాణ కాంగ్రెస్ అభివర్ణిస్తోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు. వాటి స్థానంలో తెలంగాణ అమరవీరుల బలిదానాలను చాటిచెప్పే గుర్తులకు, సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తిని అద్దంపట్టే గుర్తులకు రాష్ట్ర అధికారిక చిహ్నంలో చోటు కల్పిస్తామని రేవంత్ సర్కారు అంటోంది. ఈ దిశగా మార్పులు చేసి.. కొత్త అధికారిక చిహ్నాన్ని డిజైన్ చేయించే ప్రక్రియ శరవేగంగా జరుగుతోందని తెలుస్తోంది. మరోవైపు జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేస్తూ.. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సందేశమంతా చాలా బాగుంది. అయితే ఖర్గే ట్వీట్‌కు జతపరిచిన ఫొటోలో చార్మినార్, కాకతీయ తోరణం ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెసేమో రాష్ట్ర అధికారిక చిహ్నం నుంచి ఆ రెండు గుర్తులను తీసేయాలని వాదిస్తుంటే.. జాతీయ కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అవే గుర్తులతో రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం. బహుశా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అలా  జరిగి ఉండొచ్చు. ఏదిఏమైనప్పటికి ఖర్గే ట్వీట్‌ను ఆసరాగా చేసుకొని కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ వేదికగా విమర్శలు సంధించింది.

We’re now on WhatsApp. Click to Join

‘‘తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలలో కాకతీయ తోరణం, చార్మినార్‌‌ను చేర్చినందుకు ధన్యవాదాలు ఖర్గే జీ..  తెలంగాణ ఆత్మగౌరవాన్ని మర్చిపోయిన ‘యాక్సిడెంటల్ సీఎం’ రేవంత్‌లా కాకుండా కాంగ్రెస్‌లోని ఎవరైనా మా కల్చరల్ వారసత్వాన్ని గుర్తిస్తుంటే  చూసి చాలా సంతోషంగా ఉంది. మీ ధ్రువీకరణ అతడి ముఖంపై చెంపదెబ్బ లాంటిది’’ అని పేర్కొంటూ బీఆర్ఎస్ పార్టీ(BRS Vs Congress)  ట్వీట్ చేసింది.

Also Read : Sonia Gandhi : ఎగ్జిట్ పోల్స్ తూచ్.. గెలిచేది మేమే : సోనియాగాంధీ

తెలంగాణ చిహ్నం మార్పుపై కోర్టులో కేసు వేస్తామని బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ ఇటీవల ప్రకటించారు. రాష్ట్ర చిహ్నాన్ని మార్చడాన్ని ఆయన తప్పు పట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాకతీయుల చరిత్ర ఏంటో తెలుసా అని ఆయన ప్రశ్నించారు. రాచరికపు చిహ్నాలు అంటూ చేస్తున్న మార్పులపై కోర్టులో కేసు వేస్తామన్నారు. న్యాయస్థానంలోనే తాము ఈ విషయంలో తేల్చుకుని తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుతామని చెప్పారు.

  Last Updated: 03 Jun 2024, 12:50 PM IST