BRS New Plan: హైద‌రాబాద్‌లో ప‌ట్టు కోల్పోకుండా బీఆర్ఎస్ న‌యా ప్లాన్‌..!

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో బీఆర్ఎస్ ప‌ట్టు కోల్పోకుండా ఉండేందుకు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొత్త వ్యూహం (BRS New Plan) ర‌చించిన‌ట్లు తెలుస్తోంది.

  • Written By:
  • Updated On - July 4, 2024 / 09:28 PM IST

BRS New Plan: గ‌తేడాది జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ కేవ‌లం 39 సీట్ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. అయితే కేవ‌లం గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో 40 సీట్లు సాధించిన విష‌యం తెలిసిందే. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో మొన్న‌టివ‌ర‌కు స్ట్రాంగ్‌గా ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడిప్పుడే కాస్త డీలా ప‌డుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ వైపు చూడ‌ట‌మే ఇందుకు కార‌ణంగా క‌నిపిస్తోంది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌కు, కీల‌క నేత‌ల‌కు, కార్పొరేట‌ర్ల‌కు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ప్ర‌తిరోజూ ధైర్యం చెబుతూనే ఉన్నారు. అయితే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో తొలిసారి కేసీఆర్ పార్టీ ఒక ఎంపీ స్థానంలో కూడా గెల‌వ‌క‌పోవ‌డంతో బీఆర్ఎస్ పార్టీ అందులో ఉన్న కీల‌క నాయ‌కుల రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఏంట‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఈ క్ర‌మంలోనే గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో బీఆర్ఎస్ ప‌ట్టు కోల్పోకుండా ఉండేందుకు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొత్త వ్యూహం (BRS New Plan) ర‌చించిన‌ట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ పూర్తి బాధ్య‌త‌లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌కు అప్పగించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకోస‌మే రేపు తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ కీల‌క స‌మావేశం కూడా ఏర్పాటు చేసిన‌ట్లు స‌మాచారం అందుతోంది. తెలంగాణ భ‌వ‌న్‌లో గ్రేట‌ర్ ప‌రిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేట‌ర్ల‌తో కేటీఆర్ భేటీ కానున్నారు. శ‌నివారం జీహెచ్ఎంసీ స‌మావేశం ఉండ‌టంతో ఆ స‌మావేశంలో అనుస‌రించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేల‌కు, కార్పొరేటర్ల‌కు కేటీఆర్ దిశానిర్దేశం చేయ‌నున్నారు.

Also Read: KTR: రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటంలో రాహుల్ గాంధీ విఫలం- కేటీఆర్

అయితే గ్రేట‌ర్ ప‌రిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు చేజారి పోకుండా బుజ్జగించే ప్రయత్నంలో భాగమే ఈ సమావేశమ‌ని తెలుస్తోంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూప‌కుండా ఉండేందుకు ఆయ‌న‌కు పూర్తి భాద్యతలు ఇచ్చి త‌ల‌సాని ఆధ్వర్యంలో గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో బీఆర్ఎస్ నాయ‌కులు న‌డుచుకునేలా కేటీఆర్ న‌యా ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే గ‌త కొద్ది రోజులుగా త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ కూడా బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లోకి చేర‌బోతున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు గుప్పుమ‌న్నాయి. మ‌రోవైపు గులాబీ బాస్ కేసీఆర్ ఓ వైపు పార్టీలో ప్ర‌క్షాళ‌న మొద‌లుపెట్టిన‌ట్లు స‌మాచారం. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా బీసీ లేదా ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన కీల‌క నేత‌కు ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

We’re now on WhatsApp : Click to Join