BRS Win : ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో  బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో  బీఆర్ఎస్ పార్టీ అనూహ్య విజయాన్ని సాధించింది. 

  • Written By:
  • Updated On - June 2, 2024 / 10:59 AM IST

BRS Win : మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో  బీఆర్ఎస్ పార్టీ అనూహ్య విజయాన్ని సాధించింది.  ఆ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన నవీన్ రెడ్డి 111 ఓట్ల ఆధిక్యంతో విజయఢంకా మోగించారు.  పార్టీల వారీగా వచ్చిన ఓట్ల వివరాలను చూస్తే.. బీఆర్‌ఎస్‌‌కు 763,  కాంగ్రెస్‌‌కు 652  ఓట్లు వచ్చాయి. మొత్తం 1437 మంది ఓట్లను ప్రాధాన్యతా క్రమంలో లెక్కించారు.  ఇవాళ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. అరగంటలోనే ఫలితం వెలువడింది.  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మారెడ్డి  వ్యూహాత్మకంగా వ్యవహరించి అభ్యర్థి గెలుపులో కీలక పాత్ర పోషించారు. వాస్తవానికి రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో మహబూబ్‌నగర్ మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ నవీన్ రెడ్డి‌ని బీఆర్ఎస్ పార్టీ పోటీకి నిలిపింది.

We’re now on WhatsApp. Click to Join

ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఓటర్లుగా ఉన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ(BRS Win) నేతలే ఉన్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన భారీ విజయంతో లభించిన  ప్రోత్సాహంతో మన్నే జీవన్ రెడ్డి హస్తం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. చివరకు విజయం బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డిని వరించింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీకి ఈ విజయంతో కొంత విశ్వాసం పెరగనుంది.

Also Read :Telangana Formation Day : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఒక్క రోజే నిర్వహిస్తారా ? : కేటీఆర్

స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.  గత మార్చి28న ఎమ్మెల్సీ బైపోల్ ఎన్నిక జరిగింది.  అయితే లోక్‌సభ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ఫలితాలను నేటికి (జూన్‌ 2) వాయిదా వేసింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 1437 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో 14 మంది ఎమ్మెల్యేలు, 83 మంది జడ్పీటీసీలు, 888 మంది ఎంపీటీసీలు, 449 మున్సిపల్‌ కౌన్సిలర్లు ఉన్నారు. ఇద్దరు ఎంపీటీసీలు తమ వ్యక్తిగత కారణాలతో ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

Also Read : Telangana Formation Day 2024 : పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్