అసెంబ్లీ శీతాకాల సమావేశాలు (Assembly Session) సోమవారం పున:ప్రారంభం అయ్యాయి. కాగా సర్పంచుల పెండింగ్ బకాయిల (Sarpanch Pending Bills) చెల్లింపులపై అసెంబ్లీలో వాడివేడీ చర్చ జరిగింది. బకాయిల చెల్లింపులపై స్పష్టమైన ప్రకటన చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాకపోవడంతో బీఆర్‌ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ (BRS MLA’s Walkout) చేశారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు అవసరమైన నిధులు విడుదల కాకపోవడంతో సర్పంచులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) అసెంబ్లీలో ప్రస్తావించారు.
గ్రామ పంచాయతీలకు ఎస్‌ఎఫ్‌సీ నిధులు, ఈజీఎస్ నిధులు, 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల సమస్యలు ఎక్కువయ్యాయని హరీశ్‌రావు చెప్పుకొచ్చారు. సర్పంచులు అప్పులు చేసి పనులు పూర్తి చేసినప్పటికీ బిల్లులు చెల్లించకపోవడం బాధాకరమని అన్నారు. చిన్న కాంట్రాక్టర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల బకాయిలు కూడా పెండింగ్‌లో ఉన్నాయని వాపోయారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పల్లె ప్రగతికి అనేక చర్యలు తీసుకువచ్చిందని హరీశ్‌రావు గుర్తు చేశారు. గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, ట్యాంకర్లు, డంప్‌యార్డులు ఏర్పాటు చేసిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత పల్లె ప్రగతికి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం వల్ల గ్రామ పంచాయతీలు దెబ్బతిన్నాయని ఆరోపించారు.
బకాయిల కారణంగా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి వచ్చిందని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. నిధుల కొరతతో గ్రామాల్లో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని , ముఖ్యంగా గ్రామాల్లో పౌష్టికాహార దోషాలు, వ్యాధుల ప్రబలత పెరిగిందని హరీశ్ రావు అన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఇతర పనులకు మళ్లించడంపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల జీతాలు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఈ విషయమై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసి, వీలైనంత త్వరగా బకాయిలను చెల్లించాలంటూ డిమాండ్ చేస్తూ ప్రభుత్వ తీరుపై అసంతృప్తితో బీఆర్‌ఎస్ సభ్యులు సభ నుండి బయటికి వెళ్లారు.
Read Also : Ilaiyaraaja : ఇళయ రాజాకు అవమానం.. గర్భగుడి నుంచి బయటకు పంపిన ఆలయ నిర్వాహకులు