బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో చేరిన ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ తగలనుందా? ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రెటరీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరో మారు తెరమీదకు వచ్చింది. పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేయాలని బిఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు తీర్పు ఇచ్చింది. పార్టీ మారిన MLAల విషయంలో తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చని తీర్పు ఇచ్చింది. 10వ షెడ్యుల్ ప్రకారం అనర్హతపై ఆ నిర్ణయం ఉండాలని సూచించింది. ‘4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి’ అని గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తాజాగా డివిజన్ బెంచ్ కొట్టేసింది.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గత ఏప్రిల్ 24న దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు లోతుగా విచారించింది. బీఆర్‌ఎస్ తరఫున గెలిచి, కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి (స్టేషన్‌ఘన్‌పూర్), దానం నాగేందర్ (ఖైరతాబాద్), తెల్లం వెంకట్రావు (భద్రాచలం)పై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద పిటిషన దాఖలు చేసారు. అయితే, ఈ ముగ్గురితో పాటుగా పార్టీ మారిన వారి పైన అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసారు. దీని పైన విచారించిన హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మరి దీనిపట్ల స్పీకర్ ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.
Read Also : Canal Road : ఉమ్మడి తూర్పుగోదావరి ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్