తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మరో కీలక మలుపు తిరిగింది. బీఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో, వారి అనర్హత(BRS MLAs’ Defection Case)పై నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోందని బిఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీనిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు, అనర్హత పిటిషన్లపై తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ శాసనసభ కార్యదర్శిని హెచ్చరించింది. న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఎజీ మసీహ్‌ల ధర్మాసనం ఈ కేసును ఫిబ్రవరి 10న మళ్లీ విచారణకు తీసుకుంటామని పేర్కొంది.
Jogi Ramesh : జోగికి భయం పట్టుకుందా..?
తెలంగాణలో బీఆర్‌ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకటరావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి పార్టీ మార్పు రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర దుమారం రేపింది. బీఆర్‌ఎస్ నాయకులు వీరి అనర్హతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శాసనసభ స్పీకర్‌కు పిటిషన్ దాఖలు చేశారు. అయితే, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ అంశం కోర్టుల వరకు వెళ్లింది. తెలంగాణ హైకోర్టు తొలుత స్పీకర్‌ను అనర్హత పిటిషన్లపై నాలుగు వారాల్లో విచారణ నిర్వహించాలని ఆదేశించింది. కానీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలను రద్దు చేసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో సుప్రీంకోర్టు కేసును విచారణలోకి తీసుకుంది. సుప్రీంకోర్టు గతంలో సుబాష్ దేశాయ్ కేసులో స్పీకర్ అనర్హత పిటిషన్లను తగిన సమయంలో నిర్ణయించాలనే అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇప్పుడు అదే తరహాలో తెలంగాణ శాసనసభ కార్యదర్శిని మీ అభిప్రాయంలో తగిన సమయం ఎంత? అని ప్రశ్నించింది.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, బీజేపీ నేతలు ఈ ఫిరాయింపులను తీవ్రంగా విమర్శించారు. ఫిరాయింపులు నియంత్రించేందుకు త్వరగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆలస్యం మరిన్ని ఫిరాయింపులకు దారి తీసే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే అలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో తమ వాదనలు వినిపించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు తెలంగాణ శాసనసభ నుండి వివరణ కోరింది. స్పీకర్ ఈ అంశంపై స్పందించిన తర్వాత తదుపరి విచారణ ఫిబ్రవరి 10న జరుగనుంది. అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీసుకునే నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రజలు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా చర్చిస్తున్నారు. ఓటర్ల నమ్మకాన్ని మోసం చేసి పార్టీ మారే ఎమ్మెల్యేలకు గుణపాఠం నేర్పాలని కోరుతున్నారు.