Kadiyam: లోక్‌సభ ఎన్నికల కోడ్‌ రాగానే హామీల విషయంలో చేతు లెత్తేసే పనిలో కాంగ్రెస్‌ ఉంది: కడియం శ్రీహరి

  • Written By:
  • Updated On - February 14, 2024 / 11:33 AM IST

 

Kadiyam-Srihari-Assembly-Speech : అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ చర్చ సందర్భంగా బీఆర్‌ఎస్‌(BRS) ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆర్థిక అభివృద్ధి జరిగిందని గణాంకాలు చదివి వినిపించారు. కేసీఆర్‌(KCR) పాలనలో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి జరిగిందని తెలిపారు. బడ్జెట్‌లో గత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడానికి మాత్రమే పరిమితం అయ్యారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదని చెబుతునే ఆర్థిక వృద్ధిరేటు బ్రహ్మాండంగా ఉందని చెప్పారని పేర్కొన్నారు. ఒక పేజీలో పుట గడవలేని, జీతాలివ్వాలేని పరిస్థితి అని రాశారని.. మరో పేజీలో కేసీఆర్‌ పాలనలో తలసరి ఆదాయం పెరిగిందని, జీఎస్‌డీపీ పెరిగిందని చెప్పారని వెల్లడించారు.

“కాంగ్రెస్‌(CONGRESS) ఆరు గ్యారెంటీల పేరిట 13 హామీలు ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్‌ అభయహస్తం పేరిట అనేక హామీలు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, యువత, మైనార్టీ, మహిళ, రైతు డిక్లరేషన్‌ ప్రకటించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు లెక్కిస్తే 420 హామీలు ఉన్నాయి. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సరిపోదు. వచ్చే ఆరు మాసాల్లోకూడా ఇచ్చిన హామీలు అమలు చేసేలా లేరు. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ రాగానే హామీల విషయంలో చేతు లెత్తేసే పనిలో కాంగ్రెస్‌ ఉంది”. అని కడియం శ్రీహరి అన్నారు.

దేశంలో ఉన్న ఆర్థిక, సామాజిక పరిస్థితులకు కాంగ్రెస్‌ బాధ్యత వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. దేశంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయని చెప్పారని.. చాలా ఏళ్లు పాలించిన కాంగ్రెస్సే దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియా(Sonia)కు కేసీఆర్‌ కూడా కృతజ్ఞతలు తెలిపారు.. బడ్జెట్‌ ప్రవేశపెడుతూ తెలంగాణ ఇచ్చిన యూపీఏ, సోనియాకు కృతజ్ఞతలు చెప్పారని కడియం అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అయితే బడ్జెట్ డాక్యుమెంట్లో మలిదశ ఉద్యమ నాయకులు, కేసీఆర్‌ను మాత్రం మరచిపోవడం బాధాకరమని కడియం శ్రీహరి పేర్కొన్నారు. 1969లో తెలంగాణ తొలి దశ ఉద్యమం చేశారని.. 2001లో తెలంగాణ మలి దశ ఉద్యమం చేశారని గుర్తు చేశారు. తొలి దశ, మలి దశ ఉద్యమాలు జరుగుతున్న సమయంలో కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్సేనని తెలిపారు. తెలంగాణ(telangana)కు కాంగ్రెస్‌ న్యాయం చేయట్లేదని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చిందని స్పష్టం చేశారు. ఇందిరమ్మ రాజ్యానికి వ్యతిరేకంగానే ప్రత్యేక ఉద్యమాలు వచ్చాయని వ్యాఖ్యానించారు.

“నియంతృత్వ, నిర్బంధ పోకడలు ఉన్నాయంటున్న వారే ఎమర్జెన్సీ విధించిన విషయం మరచిపోయారు. కాంగ్రెస్‌ వాళ్లు ఎమర్జెన్సీ చీకటిరోజులు మరచిపోయినట్లున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో దేశ ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ఇందిరా గాంధీ మరణం తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ 404 స్థానాలు గెలుచుకుంది. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యమని చెప్పినా 40 సీట్లు కూడా ఆ పార్టీకి వచ్చేట్లు లేదు.” అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

read also : Narendra Modi : యూఏఈలో హిందూ ఆలయాన్ని ప్రారంభించనున్న మోడీ