సిట్ ముందుకు బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు

తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) దూకుడు పెంచింది. ఈ దర్యాప్తులో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావుకు నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 2026, జనవరి 20న ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. వీసీ సజ్జనార్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల బృందం.. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ విచారణలో లభించిన […]

Published By: HashtagU Telugu Desk
Sit Notices Harishrao

Sit Notices Harishrao

తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) దూకుడు పెంచింది. ఈ దర్యాప్తులో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావుకు నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 2026, జనవరి 20న ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. వీసీ సజ్జనార్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల బృందం.. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ విచారణలో లభించిన సమాచారం, సాంకేతిక ఆధారాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు మాజీ అధికారులు పది నెలలుగా రిమాండ్‌లో ఉండగా.. కీలక నేతలకు నోటీసులు అందడం ఈ కేసులో అసలు సూత్రధారులను వేటాడే ప్రక్రియలో భాగమని స్పష్టమవుతోంది.

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు జారీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రేపు అనగా.. మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని అధికారులు ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు.

హరీష్ రావు ఇంటికి పోలీసుల రాక..

గచ్చిబౌలిలోని హరీష్ రావు నివాసానికి వెళ్లిన పోలీసులు.. ఆయన ఇంట్లో లేని సమయంలో కుటుంబ సభ్యులకు ఈ నోటీసులను అందజేశారు. ఒక ప్రైవేట్ వార్తా ఛానల్ ఎండీ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ఈ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు పాత్ర ఏ మేరకు ఉందనే కోణంలో అధికారులు ఆయనను ప్రశ్నించే అవకాశం ఉంది. గతంలోనే హరీష్ రావు తన ఫోన్ ట్యాప్ చేయించారంటూ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదు చేయగా.. అప్పట్లో హైకోర్టు ఆ కేసును కొట్టివేసింది. అయితే ఇప్పుడు సిట్ అధికారులు నేరుగా నోటీసులు ఇవ్వడం గమనార్హం.

సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు..

మరోవైపు.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావు విచారణపై సుప్రీంకోర్టు ఇటీవల కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు సంస్థలు విచారణను ఎంత కాలం కొనసాగిస్తాయని.. ఈ కేసులో ఇంకా ఏయే అంశాలు మిగిలి ఉన్నాయని ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటికే నిందితుడు రెండు వారాల కస్టడీకి సహకరించారని గుర్తు చేస్తూ.. ఇంటరాగేషన్ ప్రక్రియను త్వరగా ముగించాలని సూచించింది. ఈ కేసు తదుపరి విచారణను అత్యున్నత న్యాయస్థానం మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది.

సిట్ దర్యాప్తు వేగం..

2024 జూన్ నెల నుంచి వి.సి. సజ్జనార్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును లోతుగా విచారిస్తోంది. అప్పటి ఇంటెలిజెన్స్ అధికారుల పాత్రతో పాటు.. రాజకీయ నాయకుల ప్రమేయంపై సిట్ అనేక ఆధారాలను సేకరించింది. ఇప్పటికే పలువురు పోలీసు అధికారులను అరెస్టు చేసి విచారించగా.. ఇప్పుడు రాజకీయ ప్రముఖుల వైపు దర్యాప్తు మళ్లింది. హరీష్ రావు విచారణకు హాజరైతే.. ఈ కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ నోటీసులు ఇస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తుండగా.. చట్టప్రకారమే చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.

 

  Last Updated: 20 Jan 2026, 11:06 AM IST