తెలంగాణ ప్రజల మీద కేసిఆర్ ది అచంచలమైన ప్రేమ అని,తెలంగాణ ప్రజల బాగు కోసం ఆయన కంటే బాగా ఎవరు ఆలోచన చేయలేరని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసిఆర్ నాయకత్వంలో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ నేడు అభివృద్దిలో దేశంలోనే నెంబర్ వన్ గా ఎదిగిందని అన్నారు. ఏ రంగం చూసుకున్నా దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కెసీఆర్ మూడున్నర ఏళ్లలో 80వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ప్రపంచమే ఆశ్చర్య పోయిందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లెవల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇంత తక్కువ కాలంలో ఎలా సాధ్యమయ్యింది అని నివ్వెరపోయారని అన్నారు. 300 కి.మీ కింద ఉన్న కాళేశ్వర జలాలు ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా ఎదురెక్కించిన అద్భుత సృష్టి కేసిఆర్ దే అని మంత్రి కొనియాడారు.
ఎస్సారెస్పీకి రివర్స్ పంపింగ్ ద్వారా తెచ్చిన నీరు మీ కళ్లకు సాక్షాత్కారంగా నిలిచిందని రైతులను ఉద్దేశించి అన్నారు. రైతు బాగు కోసం కేసిఆర్ ఆరాట పడుతుంటే…రైతును గోస పెట్టాలని కాంగ్రెస్,బీజేపీ చూస్తున్నాయనీ మండి పడ్డారు. ఒకడేమో రైతుల మోటార్లకు మీటర్లు పెడతా అని వెంట పడితే..రైతులకు 24 గంటల కరెంట్ ఎందుకని ఇంకొకడు అన్యాయంగా మాట్లాడుతున్నడని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు 3 గంటల కరెంట్ చాలు అని మాట్లాడిన దానిపై రైతులు ఆలోచన చేయాలనీ కోరారు. కాంగ్రెస్ పాలన నాటి కరెంట్ కష్టాల రోజులు మళ్ళీ కావాలా అని అడిగారు. మోసపోతే గోస పడతామని హెచ్చరించారు. ఇప్పటికే బాండ్ పేపర్ రాసిచ్చి ఎంపి గా గెలిచిన అరవింద్ మొహం చాటేసిండనీ,పసుపు బోర్డు లేదు,మద్దతు ధర లేదు అని అడిగితే ఆంబోతు లెక్క ఎగిరిపడుతున్నడని మంత్రి దుయ్యబట్టారు. మరొక్కసారి మోస పోవద్దు అని విజ్ఞప్తి చేశారు.
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా బాల్కొండ నియోజకవర్గ అభివృద్ది పరంపర ఆగదనీ మంత్రి వేముల పునరుద్ఘాటించారు. అభివృద్ది పనులకు ఆటంకం కలిగించాలని,లేని పోని ఆరోపణలు చేస్తే తాను వెనక్కి తగ్గేది లేదని మరింత ఎక్కువ అభివృద్ది చేసి చూపిస్తానని అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో కప్పలవాగు,పెద్ద వాగు 42కి.మీ పొడవు ఉన్నాయని వాటి మీద చెక్ డ్యాంలు నిర్మించుకుని నీటిని ఒడిసి పడుతున్నామని తెలిపారు. ఎటు చూసిన రెండు కి. మీ మేర బోర్లు రిజనరేట్ అయ్యి పుష్కలంగా నీటి లభ్యత ఉన్నదని తెలిపారు. ఉప్లుర్ గ్రామం వరద కాలువ,కాకతీయ కాలువ మధ్యలో పుష్కలంగా నీటితో ఎంత పచ్చగా ఉన్నదో నియోజకర్గ గ్రామాలు అన్ని అదే రీతిలో చేస్తున్నామని అన్నారు. భవిష్యత్ తరాలకు మేలు జరిగే విధంగా తను చేసే పనులు ఉంటాయనీ,నా ఆశ..శ్వాస బాల్కొండ నియోజకవర్గ ప్రజల కోసమే అని మంత్రి మరోమారు స్పష్టం చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ది,కేసిఆర్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో విస్తృత చర్చ జరిగేలా చూడాలని బిఆర్ఎస్ శ్రేణులకు సూచించారు.