Ponnala Lakshmaiah: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కీలక నేతలు పార్టీలు మారుతుండటంతో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంటోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సినీయర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాతో వరంగల్ జిల్లాలో కొంత మేర పార్టీపై ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారాక రామారావు పొన్నాల ఇంటికి వెళ్లనున్నారు.
మద్యాహ్నాం రెండు గంటలకు పొన్నాల ఇంటికి బిఅర్ ఎస్ నేతలు వెళ్తున్నారు. కెటిఅర్ వెంట పొన్నాల ఇంటికి వెళ్లనున్న పలువురు పార్టీ సినీయర్ నాయకులు వెళ్లబోతున్నారు. పొన్నాల దాదాపుగా బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇక కేటీఆర్ రంగం ప్రవేశంతో గులాబీ కండువా కప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిన్నటి వరకు కాంగ్రెస్‌లో ఉన్న పొన్నాల లక్ష్మయ్య జనగామ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపగా.. ఆయనకు టికెట్ ఇవ్వట్లేదని తెలుస్తోంది. దాంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పొన్నాల లక్ష్మయ్య తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి పంపారు.
తాను తీవ్ర మనస్తాపం చెందినట్లు లేఖలో చెప్పారని తెలిసింది. తెలంగాణలో బీసీ ఓటర్ల సంఖ్య ఎక్కువ. బీసీలకు తాము తగిన ప్రాధాన్యం ఇస్తామని కాంగ్రెస్ జాతీయ స్థాయి పెద్దలు ప్రకటించారు. కానీ టికెట్ల కేటాయింపులో బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వట్లేదని పొన్నాల లక్ష్మయ్య భావిస్తున్నారు. ఒకవేళ పొన్నాల బీఆర్ఎస్ పార్టీలో చేరితే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సిందే.
Also Read: Ambedkar Statue: జయహో అంబేద్కర్, విజయవాడలో 125 అడుగుల విగ్రహం!