తెలంగాణ(Telangana)లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్(Congress) పట్ల ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. కర్ణాటక(Karnataka) ఎన్నికల తరువాత ఊహించని రీతిలో కాంగ్రెస్ వైపు ఇతర పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. బీఆర్ఎస్(BRS) బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy), జూపల్లి కృష్ణారావు(Jupalli Krishna Rao)లు కర్ణాటక ఎన్నికల ముందు వరకు బీజేపీ(BJP)లో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ, కర్ణాటక పలితాల తరువాత వారు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. మరికొద్ది రోజుల్లో భారీ బహిరంగ సభ ద్వారా రాహుల్ లేదా ప్రియాంకా గాంధీ సమక్షంలో వారు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. వీరితో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.
రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతల మధ్య వర్గవిబేధాలు తారాస్థాయిలో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో వారిలో ఓ వర్గం కాంగ్రెస్‌లోకి వచ్చేలా పార్టీ అధిష్టానం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ నేత మల్లు రవితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరిక విషయంపై వారిద్దరి మధ్య చర్చ జరిగింది. వీరి భేటీ అనంతరం కూచకుళ్ల దామోదర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
క్యాడర్ నన్ను కాంగ్రెస్‌లో చేరాలని ప్రేజర్ చేస్తోందని అన్నారు. అయితే, నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డితో మాట్లాడిన తరువాత నా నిర్ణయం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం నాకు బీఆర్ఎస్ అధిష్టానంతో వచ్చిన ఇబ్బందేమీలేదు.. కానీ, లోకల్ ఇబ్బందులే నాకు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. నాగంతో మాట్లాడిన తర్వాత ప్రెస్‌మీట్ పెట్టి అన్ని విషయాలు చెబుతాను అని దామోదర్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీల పరిస్థితి దారుణంగా ఉందని, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు అధికారాలే లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలకు చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు రాష్ట్రంలోని పలువురు నేతలు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పకనే చెప్పారు.
దామోదర్ రెడ్డి లాంటి నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఉన్నారని, వారంతా కాంగ్రెస్‌లో చేరేందుకు మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నవారితో చర్చించి స్థానిక నేతలకు ఇబ్బందులు తలెత్తకుండా సయోధ్య కుదిర్చే ప్రక్రియను కాంగ్రెస్ అధిష్టానం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికి కర్ణాటక ఎన్నికల తరువాత కాంగ్రెస్‌లోకి ఇతర పార్టీల నేతలు క్యూ కడుతుండంతో వచ్చే ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు తప్పవనే వాదన కూడా వినిపిస్తోంది.
Also Read : Telangana Congress: బీఆర్ఎస్‌కు షాక్.. మల్లు రవితో దామోదర్ రెడ్డి భేటీ