KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ చర్యను బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. “కౌశిక్ రెడ్డి అరెస్ట్ పూర్తిగా అప్రజాస్వామిక చర్య. సీఎం రేవంత్ రెడ్డి శాసనసభ వ్యవస్థలను అపహాస్యం చేస్తున్నారు. ఇది నిరంకుశ పాలనకు నిదర్శనం” అంటూ ఆయన మండిపడ్డారు.
ప్రభుత్వ అవినీతి, మంత్రుల దుర్వినియోగాన్ని ప్రశ్నించినందుకే బీఆర్ఎస్ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. “చట్టపరమైన బలహీనతలతో కూడిన ఫేక్ కేసులతో మా నేతల ఉత్సాహాన్ని దెబ్బతీయాలనే కుట్ర జరుగుతోంది. ఇది పూర్తిగా ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం. ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వం, తమ వైఫల్యాలను ఇలా దాచదలుచుకుంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
కౌశిక్ రెడ్డి వెంటనే షరతుల లేకుండా విడుదల చేయాలని డిమాండ్ చేసిన కేటీఆర్, “ప్రజల పక్షాన మా పోరాటం తాత్కాలికంగా కాదు, దీర్ఘకాలికం” అని స్పష్టం చేశారు. ఇక మరోవైపు మాజీ మంత్రి హరీశ్ రావు కూడా ఈ అరెస్టును తీవ్రంగా ఖండించారు.”రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరి, ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోంది. ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్య” అని వ్యాఖ్యానించారు. కౌశిక్ రెడ్డి విడుదల కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందన్నారు.