Site icon HashtagU Telugu

BRS vs BJP : తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో కిషన్ రెడ్డి చెప్పాలి – దాసోజు శ్ర‌వ‌ణ్‌

dasoju sravan BRS

dasoju sravan BRS

కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు కిష‌న్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్ర‌వ‌ణ్ మండిప‌డ్డారు. కిషన్ రెడ్డి బీఆర్ఎస్‌ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేసే ప్రయత్నం చేశారని ఆయ‌న తెలిపారు. సినిమాలో హీరో నటించినట్లు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ధర్నా పేరుతో కిషన్ రెడ్డి నటించారని.. మణిపూర్ మండుతుంటే కిష‌న్ రెడ్డి తెలంగాణ‌లో సంబ‌రాలు చేసుకుంటున్నార‌ని ఆరోపించారు. రెండు తెగల మధ్య పంచాయతీ పెట్టి బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ చోద్యం చూస్తోందని.. మహిళలను వివస్త్రను చేసి పరేడ్ చేపిస్తున్నారని శ్ర‌వ‌ణ్ ఆరోపించారు. బీజేపీ చేసిన అభివృద్ధి ఏమి లేక రజాకార్ ఫైల్స్ పేరుతో సినిమా తీసి తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని.. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో కిషన్ రెడ్డి చెప్పాలని దాసోజు శ్ర‌వ‌ణ్ డిమాండ్ చేశారు. దేశంలో మిగతా రాష్ట్రాలకు ఒక నీతి…తెలంగాణకు ఒక నీతి ఉందా అని ప్ర‌శ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణాలకు ఒక్క రూపాయి ఇవ్వకుండా కిషన్ రెడ్డి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ వద్దకు ఎలా వెళ్తారని శ్ర‌వ‌ణ్ ప్ర‌శ్నించారు.

ముంబై ధారావి అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది కానీ హైదరాబాద్ నగరంలో మురికివాడల అభివృద్ధికి ఎందుకు నిధులు ఇవ్వరని శ్ర‌వ‌ణ్ ప్ర‌శ్నించారు. తెలంగాణ సమాజం పట్ల కేంద్ర ప్రభుత్వానికి వివ‌క్ష ఎందుకు అని ప్ర‌శ్నించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఐ.టీ.ఐ.ఆర్, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదో ఇంత‌వ‌ర‌కు స‌మాధానం చెప్ప‌లేద‌న్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న వివక్షపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదని ప్ర‌శ్నించారు. కేసీఆర్ రైతు బంధు,రైతు భీమాతో,ఎరువుల ద్వారా రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారని.. స్వామినాథన్ కమీషన్ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం అమ‌లు చేయ‌డం లేద‌న్నారు. పోడు భూముల సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టి లక్షా 56 వేల మందికి పైగా రైతుల పోడు భూములకు పట్టాలు ఇచ్చామ‌ని.. తెలంగాణ ప్రభుత్వంలో లక్షా 30 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని దాసోజు శ్ర‌వ‌ణ్ తెలిపారు. బీజేపి పాలిత రాష్ట్రాల్లో పింఛన్ ఎంత ఇస్తున్నారో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. గుజారాత్ లో 750 రూపాయలు మాత్రమే పింఛన్ ఇస్తున్నారని శ్ర‌వ‌ణ్ గుర్తు చేశారు.