Site icon HashtagU Telugu

BRS Party: పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ సైలంట్.. కేసీఆర్ వ్యూహం ఏమిటో!

Brs Trs

Brs Trs

BRS Party: కేసీఆర్ ఇప్పటి వరకూ వ్యక్తిగతంగా పార్లమెంట్ ఎన్నికల కోసం కసరత్తు చేశారేమో కానీ.. ప్రత్యేకంగా పార్టీ నేతలతో ఎలాంటి సమీక్షలు చేయలేదు. మూడు నాలుగు పార్లమెంటు సెగ్మెంట్లపై సమీక్షా సమావేశాలు, పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆరెస్ ఎంపీలకు మార్గనిర్దేశం చేయడం మినహా అంత సీరియస్‌గా లేరనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కాంగ్రెస్ నాయకత్వం రాష్ట్రంలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఆశావహులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి, వాటిని పరిశీలించి ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించింది. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు ఏ రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డిని ప్రజలకు పరిచయం చేశారు.

పార్లమెంటు స్థానాలవారీగా కాంగ్రెస్ నాయకత్వం మంత్రులకు ఇప్పటికే బాధ్యతలు అప్పగించింది. మొత్తం 17 స్థానాలకుగాను కనీసం 14 స్థానాలను దక్కించుకోవాలని పార్టీ నాయకత్వం వ్యూహరచన చేస్తున్నదని సమాచారం. ఇప్పటికే అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా మంత్రులు సమీక్షలు నిర్వహించి, కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న విజయం కాకపోయినా ఎనిమిది అసెంబ్లీ సీట్లను గెల్చుకున్న బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని భావిస్తున్నది. ఆ మేరకు రాష్ట్ర నాయకత్వం క్షేత్రస్థాయిలో ప్రచారం ముమ్మరం చేసింది. విజయ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ విజయ సంకల్ప యాత్రల ద్వారా ఓటు బ్యాంకు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీఆరెస్‌తోపాటు కాంగ్రెస్ పార్టీపై విమర్శల దాడి ఎక్కుపెడుతున్నారు. బీజేపీతో పొత్తు కోసం బీఆరెస్ తన శక్తియుక్తులను ప్రయోగిస్తున్నదన్న ప్రచారం జరుగుతోంది. కానీ బీజేపీ వైపు నుంచి సానుకూల సంకేతాలు రావడం లేదు.  రెండు రోజుల క్రితం జరిగిన విజయ సంకల్పయాత్రలో సంజయ్ మాట్లాడుతూ, బీఆరెస్‌తో పొత్తు ఉండదని, పొత్తు ఉంటుందని ఎవరైనా అంటే చెప్పులతో కొట్టండని చెప్పారు. అక్కడితో ఆగకుండా.. సభలో పాల్గొన్న కార్తకర్తలు, ప్రజలు చెప్పులు ఎత్తి చూపించాలని పిలుపునిచ్చారు. ఇలాంటి పొత్తుల ప్రచారం జరగడం వల్ల బీజేపీ, బీఆరెస్‌ ఒక్కటేననే బలమైన ప్రచారం జరుగుతోందని దాని వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని బండి సంజయ్ భావిస్తున్నారు.

Exit mobile version