పాలమూరు అభివృద్ధిలో విఫలమైన బీఆర్ఎస్ : సీఎం రేవంత్ రెడ్డి

దేశవ్యాప్తంగా నిర్మితమయ్యే ప్రాజెక్టుల్లో పాలమూరు బిడ్డల కష్టపడి పనిచేసిన చెమట ఉన్నా స్వంత జిల్లాకు మాత్రం న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Published By: HashtagU Telugu Desk
BRS has failed in the development of Palamuru: CM Revanth Reddy

BRS has failed in the development of Palamuru: CM Revanth Reddy

. మహబూబ్‌నగర్‌లో రూ.1,284 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

. పెండింగ్ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం..అసెంబ్లీలో చర్చకు దూరం

. పాలమూరు అభివృద్ధికి ప్రభుత్వ హామీ..సంక్షేమంలో వేగం

CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి ఘాటు విమర్శలు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన రూ.1,284 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ..పదేళ్ల కేసీఆర్ పాలనలో పాలమూరు జిల్లాకు ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా తీసుకురాలేదని తీవ్రంగా ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా నిర్మితమయ్యే ప్రాజెక్టుల్లో పాలమూరు బిడ్డల కష్టపడి పనిచేసిన చెమట ఉన్నా స్వంత జిల్లాకు మాత్రం న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు అభివృద్ధిని ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టారని ఇది ప్రజలకు చేసిన ఘోర అన్యాయమని పేర్కొన్నారు.

2013లో కాంగ్రెస్ నేతలు సాధించిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టు పూర్తికాకుండానే కాంట్రాక్టర్లకు రూ.23 కోట్లు చెల్లించారని ఉద్ధండాపూర్ జలాశయం భూనిర్వాసితులకు ఇప్పటికీ సరైన పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. సంగంబండ వద్ద బండను పగులగొట్టేందుకు కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. పాలమూరు జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చకు పెట్టినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభకు రాకుండా తప్పించుకున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మూడు సంవత్సరాలకే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ఎద్దేవా చేస్తూ అవినీతి నిర్లక్ష్యానికి అదే నిదర్శనమన్నారు.

పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 3.50 కోట్ల మంది పేదలకు రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శిస్తూ తమ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని వెల్లడించారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాష్ట్రానికి బీజేపీ ఎంపీలు ఐఐఎం తీసుకువస్తే భూమి కేటాయించే బాధ్యత తనదేనని స్పష్టం చేస్తూ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి సహకరిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. పాలమూరు ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన హామీ ఇచ్చారు.

 

 

  Last Updated: 17 Jan 2026, 10:55 PM IST