KCR : రాబోయేది బిఆర్ఎస్ సర్కారే ..15 ఏళ్ల పాటు అధికారం మనదే – కేసీఆర్

రాష్ట్రంలో కరెంటు, తాగునీరు, శాంతి భద్రతల సమస్య చూసి బాధేస్తోందన్నారు

  • Written By:
  • Publish Date - July 2, 2024 / 08:21 PM IST

తెలంగాణ (Telangana) లో రాబోయేది బిఆర్ఎస్ (BRS) సర్కారే అని..15 ఏళ్ల పాటు అధికారం మనదే అని ధీమా వ్యక్తం చేసారు బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ (KCR). కాంగ్రెస్ పార్టీకి ఒక లక్షణం ఉందని, ఒకసారి అధికారంలోకి వస్తే పిచ్చిపిచ్చి పనులన్నీ చేసి ప్రజల చేత ఛీ అనిపించుకునేలా వాళ్ళు ప్రవర్తిస్తారని అన్నారు. గతంలో ఎన్టీఆర్ పాలన తర్వాత అలాగే జరిగిందని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ జడ్పీ చైర్మన్లతో మంగళవారం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌ ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరెంటు, తాగునీరు, శాంతి భద్రతల సమస్య చూసి బాధేస్తోందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాల పేర్లు మార్చకుండా అలానే కొనసాగించామని గుర్తు చేశారు. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు సౌజన్యం, గాంభీర్యం ఉండాలని , కాంగ్రెస్ నాయకులు రైతుబంధుకు ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో జడ్పీ చైర్మన్లు అందరూ రాష్ట్రం అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారని, విజయవంతంగా పదవీకాలాన్ని పూర్తి చేసినందుకు అందరికీ శుభాకాంక్షలని చెప్పారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రజా జీవితంలో ఒకసారి నిలిచిన తర్వాత అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పని చేసేటోళ్లే నిజమైన రాజకీయ నాయకులని అన్నారు. అప్పుడు ఉన్న అధికారులే ఇప్పుడు ఉన్నప్పటికీ శాంతి భద్రతల సమస్య ఎందుకు వస్తున్నదో ఆలోచించాలని కేసీఆర్‌ అన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసి చూపించిందని పేర్కొన్నారు. పార్టీ నాయకులను సృష్టిస్తుంది కాని నాయకులు పార్టీని సృష్టించరని, మంచి యువ నాయకత్వాన్ని తయారు చేస్తామని పేర్కొన్నారు. అత్యున్నత పదవులు అనుభవించి పార్టీని వీడుతున్న వారిని ‘నాలుగు రోజులు పదవులు లేకపోతే ఉండలేరా..?’ అని ప్రజలే అసహ్యించుకుంటున్నారని అన్నారు.

తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా జరగాల్సి ఉన్నదని, ఈసారి బీఆర్‌ఎస్‌ తరపున ఎవరికి బీ ఫామ్ దక్కితే వాళ్లదే విజయమని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కొంచెం కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయన్నారు.

Read Also : UP Hathras Stampede : 107కు చేరిన మృతుల సంఖ్య