Bhatti: తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్‌ కార్డు ఇవ్వలేదు : డిప్యూటీ సీఎం భట్టి

  • Written By:
  • Updated On - December 28, 2023 / 01:53 PM IST

Bhatti: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరోసారి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ‘ప్రజాపాలన’ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ప్రజలెవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని.. ఇది ప్రజా ప్రభుత్వమని చెప్పారు. ‘మా పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తాం’ అని బెదిరించే ప్రభుత్వం తమది కాదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేసి తీరుతామని వెల్లడించారు.

10 ఏళ్లలో రాష్ట్ర ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలు పొందలేదన్న భట్టి.. తొమ్మిదేళ్లలో గత ప్రభుత్వం ఒక్క రేషన్‌ కార్డు ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రజల చేత ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం తమది అని అన్నారు. ఈ రాష్ట్రాన్ని, సంపదను ప్రజలకు అంకితం చేస్తామని భట్టి వెల్లడించారు. ఇక తెలంగాణలో గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణం అనంతరం రసీదు ఇస్తున్నారు.

జనవరి 6 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ 4 పేజీల దరఖాస్తులో కాంగ్రెస్‌ గ్యారెంటీల వివరాలు ఉన్నాయి. లబ్ధిదారులు.. దరఖాస్తుతోపాటు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో, ఆధార్‌, రేషన్‌ కార్డులను జత చేయాలని అధికారులు సూచించారు. ప్రజల దగ్గరకే వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్‌ పెట్టి దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు.