BRS to Congress: తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. అధికార పార్టీ బిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య బిగ్ ఫైట్ నెలకొంది. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించారు. బీజేపీ ఇంకా ఆ దిశగా వెళ్ళలేదు. త్వరలోనే ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే పార్టీ టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు పార్టీలు మారుతున్నారు. బీఆర్ఎస్ నుంచి రోజురోజుకి బయటకు వస్తున్నారు.
అధికార బీఆర్‌ఎస్‌కు గట్టి షాక్ ఇస్తూ జీహెచ్‌ఎంసీ ఫ్లోర్ లీడర్, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ , ఇతర నేతలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు .జూబ్లీహిల్స్‌లోని నివాసంలో రేవంత్‌రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.జగదీశ్వర్ గౌడ్ గత కొంతకాలంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే టికెట్‌కోసం ప్రయత్నాలు జరిపారు. అయితే బీఆర్ఎస్ అధిష్ఠానం మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ ఇవ్వడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ టిక్కెట్ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన హస్తం గూటికి చేరారు.
కాంగ్రెస్ లోకి మరిన్ని చేరికల పర్వం కొనసాగనుంది. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమయ్యాడు. అదేవిధంగా మండవ వెంకటేశ్వర్ రావు, ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ జాతీయ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ముధోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు. మరో వైపు ఉమ్మడి నల్గొండలో బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ సహా ఐదుగురు కౌన్సిలర్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే చందర్ రావుతో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు.
Also Read: Revanth Reddy: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం, నిరుద్యోగురాలికి రేవంత్ రెడ్డి హామీ!