Telangana: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందలేదని, ఆర్థిక విధ్వంసం సృష్టించారని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు

Telangana: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందలేదని, ఆర్థిక విధ్వంసం సృష్టించారని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్న రాష్ట్రం ఆరు లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. తెలంగాణ ఏర్పడేనాటికి అప్పు కేవలం రూ. 72 వేల కోట్లు అయితే పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అది 6.71 లక్షల కోట్లకు పెరిగింది. ఇన్ని రోజులూ తెలంగాణ ప్రజలు కేవలం లక్ష కోట్ల అప్పు మాత్రమే ఉందని భావించారు. కానీ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వాస్తవాలను దాచిపెట్టిందని దుయ్యబట్టారు. .

2014లో 14 శాతం ఉన్న రుణభారం బీఆర్‌ఎస్‌ హయాంలో 34 శాతానికి పెరిగిందన్నారు. కార్పొరేషన్లు అధిక వడ్డీలకు అప్పులు చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. అప్పు తీర్చేందుకు మళ్లీ అప్పు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. వీటన్నింటినీ ప్రజలకు తెలియజేసేందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో మరో ఉద్దేశం లేదని, ప్రతిపక్ష సభ్యులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, రాష్ట్రానికి నష్టం జరుగుతుందని భావించవద్దని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భట్టి అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. అప్పు వాయిదాలు, వడ్డీ కింద ఏటా రూ.53 వేల కోట్లు చెల్లించాల్సిన దుస్థితిని బీఆర్‌ఎస్ తీసుకొచ్చిందని భట్టి మండిపడ్డారు. రోజువారీ ఖర్చులకు కూడా ఓడీపైనే ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పులు చేసి ప్రజల నుంచి నీటి పన్ను వసూలు చేసిందన్నారు. మిషన్ భగీరథ పథకంపై కూడా విచారణ జరిపించాలని సీఎంను కోరారు.

Also Read: MG Motors : ఎంజీ మోటార్స్ ఈ కార్లపై ఇయర్ ఎండ్ ఆఫర్స్.. రూ.లక్షల్లో డిస్కౌంట్..